Reading Time: < 1 minute

భూ వివాదాలు లేని తెలంగాణే లక్ష్యం.. గత BRS ప్రభుత్వ విధానాలతో రెవిన్యూ వ్యవస్థ ఆగమైంది

Caption of Image.
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హనుమకొండ, వెలుగు: భూ వివాదాలు లేని తెలంగాణే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్వాకం, స్వార్థ పూరిత విధానాల వల్ల రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ ఆగమైందని, ప్రజా ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామన్నారు. 

హనుమకొండ కలెక్టరేట్‌‌‌‌లో గురువారం నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవానికి చీఫ్ గెస్ట్ గా మంత్రి పొంగులేటి హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతం, రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రజా పాలన దినోత్సవం, రాష్ట్ర, జిల్లా ప్రగతిపై పొంగులేటి ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం ఎజెండాగా పని చేస్తోందన్నారు. 

రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. భూవివాదాలకు పరిష్కారం చూపాలన్న సంకల్పంతో 125 ఏండ్ల తరువాత రాష్ట్రంలో భూముల రీసర్వే చేస్తున్నామన్నారు. హైదరాబాద్– -సికింద్రాబాద్ జంట నగరాల తరహాలోనే హనుమకొండ– -వరంగల్‌‌‌‌ను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. 

కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య,  ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి,  వరంగల్ సీపీ శ్వేత, హనుమకొండ  కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం స్థానిక నేతలతో కలిసి హనుమకొండ అదాలత్ జంక్షన్ లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. వరంగల్‍ కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన ప్రజాపాలన వేడుకల్లో రాష్ట్ర ప్లానింగ్‍ బోర్డ్‌‌‌‌ వైస్‍ చైర్‍పర్సన్‍ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.