
బాలాఘాట్: మధ్య ప్రదేశ్‌లో ఆ రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతోనే 30 మంది గిరిజన చిన్నారులు మృతిచెందారని కాంగ్రెస్అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బాలాఘాట్ జిల్లాలో చిన్నారుల మరణాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మధ్యప్రదేశ్ ప్రభుత్వం నేడు భారతదేశంలోనే అత్యంత అవినీతి, అత్యంత అసమర్థ ప్రభుత్వం. ఇదే వాస్తవం’ అని ఆయన విమర్శించారు.
అనారోగ్యం, పోషకాహార లోపం, సరైన ఆరోగ్య వసతులు లేకపోవడం వల్ల 30 మందికి పైగా గిరిజన పిల్లలు మరణించడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని గురువారం ఎక్స్ వేదికగా రాహుల్ ఆరోపించారు. అలాగే, ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘దీపాలు వెలిగించి వేడుకలు నిర్వహించుకోవడం నుంచి మీకు తీరిక దొరికితే, దయచేసి రాష్ట్రంలోని క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ఒకసారి చూడండి’ అని హితవు పలికారు.
రాష్ట్రంలో వ్యాధుల నియంత్రణ లేకపోవడం, సరైన పోషకాహారం, శుద్ధమైన నీరు అందకపోవడం, బలహీనమైన వైద్య వ్యవస్థ కారణంగా చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని రాహుల్ పేర్కొన్నారు. కల్తీ మందులు, అక్రమ మద్యం రాష్ట్రంలోని కుటుంబాలను నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. తాను ఇండోర్‌కు వెళ్తున్నానని, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, సామాన్య ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నానని తెలిపారు.
మధ్యప్రదేశ్ విద్యావ్యవస్థ దేశంలోనే అత్యంత దారుణంగా తయారైందన్నారు. కాగా, ఈ చిన్నారుల మరణాలకు బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం, ఆరోగ్య మంత్రి రాజేంద్ర శుక్లా వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది
కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
చిన్నారుల మరణాలకు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చిన్నారులకు సరైన ట్రీట్మెంట్అందడం లేదని, 50 పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రిలో సుమారు 400 మంది పిల్లలకు చికిత్స అందిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వివేక్ రుసియా, జస్టిస్ ప్రదీప్ మిట్టల్ బెంచ్ విచారించింది.