Reading Time: 3 minutes

వాతావరణ మార్పు (క్లైమెట్ చేంజ్) అన్నది ఒక వైపరీత్యం. వినాశకారి అయిన ఇది ప్రకృతి సిద్ధం కాదు. ప్రధానంగా మానవ చర్యల ఫలితం! మనిషి కార్యకలాపాల వల్ల పెరిగిన వాతావరణ కాలుష్య ఫలితమే కర్బన ఉద్గారాలు, వాటి వల్లనే భూతాపం పెరుగుతోంది. భూతాపోన్నతి కారణంగానే వాతావరణ మార్పులు అనేక విపరిణామాలకు దారితీస్తున్నాయి. భూతాపం హెచ్చడం వల్ల సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి, ధ్రువాల మంచు కరుగుతోంది, సముద్ర జలమట్టాలు పెరుగుతున్నాయి. దీవులు, తీరనగరాలు నీట మునిగే ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది. వాతావరణ మార్పులవల్ల రుతుక్రమం మారి అతివృష్టి – అనావృష్టి వంటి వైపరీత్యాలు చోటుచేసుకొని తీవ్రమైన అకాల వర్షాలు -వరదలు ఒకవైపు, వడగాలులు, కరువు- కాటకాలు మరొక వైపు విజృంభిస్తున్నాయి. ఆహారోత్పత్తి, తాగునీటి సౌలభ్యం వంటి పలు అంశాల్ని విపరీతంగా ప్రభావితం చేస్తోంది. వాతావరణ మార్పు ఒక్క మానవాళికే కాకుండా సమస్త జీవరాశికి, ఇంకా చెప్పాలంటే భూగ్రహం మనుగడకే ప్రమాదం తెస్తోంది. మనమంతా ఈ స్పృహ కలిగి ఉండాలి. వాతావరణ మార్పులకు సత్వర విరుగుడు చర్యలు, ఉపశమన విధానాలు, ఎదుర్కొనే ఎత్తుగడలు ఈ ప్రపంచం మొత్తానికి కావాలి. ఈ చర్యలు ప్రభుత్వాలు చేపట్టేలోగా, ఇందుకవసరమైన విధానాలను కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు పాటించే విధంగా పౌరసమాజం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఐక్యరాజ్యసమితి (యుఎన్) ఏర్పరచిన ‘అంతర్ ప్రభుత్వాల అధ్యయన బృందం’ (ఐపిసిసి) నివేదికల ప్రకారం వాతావరణ మార్పు ప్రమాదం అనుకున్నదాని కన్నా వేగంగానే ముంచుకువస్తోంది. ముఖ్యంగా భారత ఉపఖండంమీద ప్రతికూల ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. వ్యవసాయిక ప్రధానమైన భారత దేశంలో వ్యవసాయం మీద, ఆహారోత్పత్తి పైన ఈ వాతావరణ మార్పుల దెబ్బ గట్టిగానే పడనుంది. ఫలితంగా వ్యవసాయం దెబ్బతినడమే కాకుండా ఆహార ఉత్పత్తి రమారమి తగ్గి ఆర్థిక- సామాజిక సంక్షోభం తలెత్తే ఆస్కారం ఉంది. ఏకకాలంలో వేర్వేరు స్థాయిల్లో చర్యలు అవసరమవుతున్నాయి. క్లైమెట్ ఛేంజ్‌ను అన్ని విధాలా ఎదుర్కొనేలా రెజిలియన్స్, మిటిగేషన్, అడాప్టేషన్ చర్యల్ని కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి. కంపెనీలు, కార్పొరేట్లు ఇందుకు పూర్తిస్థాయిలో సహకరించాలి. ఈ విషయాల్లో ఇటు ప్రజలకు అటు ప్రభుత్వాలకు, కంపెనీలు-, కార్పొరేట్లకు తమ విధులు, కర్తవ్యాలు బోధపడేలా ప్రసార మాధ్యమాలు (మీడియా) అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది మీడియా బాధ్యతల్లో ప్రధానమైంది. ఎందుకంటే, ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలోని దాదాపు మొత్తం జనాభా ప్రభావితమయ్యే పరిణామమిది. సకాలంలో స్పందించకుంటే విపరిణామాలు సరిదిద్దలేని స్థితికి చేరుకొని, సమస్య మరింత జటిలమవుతుంది. అందుకే తగినంత ముందుగానే మేల్కొనాలి.

వాతావరణ మార్పులవల్ల ముంచుకువస్తున్న ప్రమాద తీవ్రతపై మీడియా ఎప్పటికప్పుడు కథనాలు వెలువరిస్తూ అందరికీ అవగాహన పెంచాలి. వాతావరణ కాలుష్యాలు, కర్బన ఉద్గారాలు, చట్ట నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు, వాటి మూలంగా తలెత్తే విపరిణామాలు… అన్నింటిపైన పరిశోధనాత్మకంగా వివరాలు సేకరించి, సమగ్రంగా వెల్లడించాలి. తగిన గణాంకాలు, శాస్త్రాధారాలతో వాటిని నిరూపించాలి. తద్వారా బాధ్యుల్ని గుర్తిస్తూ పర్యావరణ న్యాయం దిశగా సమాజాన్ని నడిపే కృషికి మీడియా నడుం కట్టినట్టవుతుంది. దీన్ని బాధ్యతగా, నిరంతర ప్రక్రియగా నిర్వర్తించాలి. సమస్య తీవ్రతను ఎత్తిచూపడంతో పాటు తగిన పరిష్కార మార్గాలను తెలపాలి. ఆ దిశలో ఎక్కడైనా జరుగుతున్న మంచిని ఇతర ప్రాంతాలకు పరివ్యాప్తం చేయాలి. విధానపరమైన ప్రభుత్వ వైఫల్యాలను ఒకవైపు ఎత్తిచూపుతూనే మరోవైపు విస్మరిస్తున్న కంపెనీలు, -కార్పొరేట్ల బాధ్యతను, జవాబుదారీతనాన్ని ఎండగట్టాలి. పాలక పక్షాలు, మార్కెట్ శక్తులు కావాలని ప్రచారంలోకి తెచ్చే తప్పుడు కథనాలను (డామినెంట్ న్యారేటివ్స్)కి వ్యతిరేకంగా వాస్తవాలతో కూడిన సమాచారం, ఆధారాలు సేకరించి ప్రచురించాలి/ ప్రసారం చేయాలి. నిజాన్ని మరుగుపరచి ప్రమాద పరిస్థితిని ఎలా ముదరనిస్తున్నారో, జటిలం చేస్తున్నారో ఎత్తిచూపి ఎండగట్టాలి.

అప్పుడే పర్యావరణ న్యాయం సాధ్యమవుతుంది. అదే సమయంలో పౌరులు అనుసరించవలసిన విధానాలు, పాటించవలసిన నియమాలు, నిర్వర్తించాల్సిన విహిత కర్తవ్యాలను గట్టి స్వరంతో మీడియా వినిపించగలగాలి. రాజ్యాంగం పౌరులకు హామీ ఇచ్చిన హక్కుల పరంగానే కాకుండా వారి కర్తవ్యంగా నిర్వచించిన ‘రాజ్యాంగ విధులు-బాధ్యతల’ పరంగా కూడా పర్యావరణానికి ఎలా దోహదపడాలో తెలిసి వచ్చేలా మీడియా వారిని చైతన్యపరచాలి. పత్రికలు, టివి చానళ్లు, రేడియో వంటి సంప్రదాయ మీడియాకు తోడు ఇటీవలి కాలంలో ఎంతో ప్రభావితం చేస్తున్న ‘సామాజిక మాధ్యమాలు’ (సోషల్ మీడియా) కూడా ఈ అంశంపై సుస్థిరమైన విధానంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

వాతావరణ మార్పుల పరంగా నెలకొని ఉన్న తాజా స్థితిని దృష్టిలో ఉంచుకొనే ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషనన్ — సిజిఆర్ వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టింది. పర్యావరణ కృషిలో వైవిధ్యభరితమైన కార్యకలాపాలను పదిహేనేళ్లుగా నిర్వహిస్తోంది. ‘వాతావరణ మార్పుల’ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు చైతన్య కార్యక్రమాలను నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి (యుఎన్) నిర్దేశించిన 17 సుస్థిరాభివద్ధి లక్ష్యాల (ఎస్‌డిజిఎస్) సాధన తాజా స్థితి ఏమిటి? వాటిపైన వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావమెంత? అందుమూలంగా చేపట్టవలసిన, -చేపడుతున్న చర్యలేమిటి? ఇత్యాది విషయాలపైన సిజిఆర్ సదస్సులు నిర్వహించింది. చిరుగ్రామమైన అన్మాస్పల్లి నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఈ అంశాలపై పలు సమావేశాలు జరిపి, ఇందుకు సంబంధీకులైన వారిని భాగస్వాముల్ని చేసింది.

జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్‌జిటి) చైర్మన్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరకు, వివిధ పార్టీల నాయకుల వరకు పాల్గొనేలా చేసింది. ప్రతికూలంగా ప్రభావితులయ్యే వర్గాలతోపాటు శాస్త్ర, పరిశోధన, అధ్యయన, న్యాయ, విధాన, పాలనాపరమైన ముఖ్యులందరినీ భాగం చేస్తూ, భవిష్యత్ కార్యాచరణకు అవసరమైన భూమికను సిద్ధం చేయడంలో తన వంతు పాత్రను సిజిఆర్ పోషించింది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, ఇంటర్-, డిగ్రీ, -పీజీ వరకున్న కాలేజీ, విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యార్థులు, వారి బోధకులతో సంపర్కం ఏర్పాటు చేయగలిగింది. వారందరికీ విషయాలు తెలిసి వచ్చేలా పర్యావరణంపై సాధారణంగా, వాతావరణ మార్పులపై ప్రత్యేకంగా పలు అవగాహనా కార్యక్రమాల్ని సిజిఆర్ నిర్వహించింది. మరింత ప్రణాళికాబద్ధంగా అటు ప్రభుత్వాలు, కంపెనీలు, కార్పొరేట్లు ఇటు పౌరులు, పౌర సంఘాలు, ప్రజాసంస్థలు ఈ అవగాహన పెంచుకుంటూ మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాలి. విశాల సమాజహితంలో తమ కార్యాచరణను సిజిఆర్‌తో పాటు పర్యావరణంపై పనిచేసే ఇతర సంస్థలు మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘ పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ )