Reading Time: 2 minutes

హైదరాబాద్ నగర చరిత్రలో లంగర్‌హౌస్ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడే 1948లో జాతిపిత మహాత్మా గాంధీ అస్థికలు నిమజ్జనం చేయబడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఈ చారిత్రక స్థలాన్ని స్మారక కేంద్రంగా మార్చడమే కాకుండా, మూసీ నది పునరుద్ధరణ, నగర సుందరీకరణ, వరద నివారణలతో సమన్వయపరచి సమగ్ర అభివృద్ధిని సాధించాలనే దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది. మహాత్మాగాంధీ సత్యం, అహింస, సమానత్వం వంటి మహా విలువలను భారత జాతీయోద్యమానికి అందించారు. లంగర్ హౌస్‌లో అస్థికల నిమజ్జన స్థలాన్ని అభివృద్ధి చేయడం అంటే చరిత్రను సజీవంగా ఉంచడమే కాదు.. ఆ విలువలను యువతకు అందించడం. ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం, గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ, శాంతి విగ్రహ మ్యూజియం, మెడిటేషన్ విలేజ్ వంటి నిర్మాణాలు ఇక్కడ ఏర్పాటవుతాయి.

గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం, ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వంటి స్మారకాలు జాతీయ గౌరవానికి ప్రతీకలుగా నిలిచాయి. అలాగే గాంధీ సరోవర్ తెలంగాణలో సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా మారుతుంది. మూసీ-ఈసా నదుల సంగమం సమీపంలో భారీ స్మృతి వనం, హ్యాండ్లూమ్ ప్రమోషన్ హబ్, నాలెడ్జ్ సెంటర్లు గాంధీజీ ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విభజన రాజకీయాలకు ఆయుధంగా కాకుండా, ప్రజాస్వామ్య విలువలకు బలం చేకూర్చే సంకల్పంగా చూపించింది. ఇది హైదరాబాద్ను గేట్‌వే ఆఫ్ హైదరాబాద్‌గా మారుస్తూ, ఐకానిక్ టవర్‌తో ప్రపంచస్థాయి చిహ్నంగా నిలబెడుతుంది. హైదరాబాద్ గుండెకాయగా ప్రవహించే మూసీ నది గత దశాబ్దాలుగా కాలుష్యం, వరదలు, చెరువుల ఆక్రమణలకు గురైంది. కాంగ్రెస్ ప్రభుత్వం 55 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ అభివృద్ధితో మూసీ ప్రక్షాళనకు కొత్త ఊపిరిలు ఊదుతుంది. గోదావరి నది నుంచి 5 టిఎంసిల నీటిని మూసీలోకి మళ్లించి, ఏడాది పొడవునా నీటి ప్రవాహాన్ని నిలబెట్టే ప్రణాళిక దీర్ఘకాల దృష్టిని సూచిస్తుంది.

సిఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టును స్వచ్ఛ పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించే కార్యక్రమంగా వివరించారు. వరదల నుంచి రక్షణ, పర్యాటక అవకాశాల పెరుగుదల, పచ్చదన విస్తరణ ఇవన్నీ సమగ్ర లక్ష్యాలు. ఇమ్మేద్ సాగర్‌బండు, ఎక్స్‌ఎకో పార్క్ వంటి చర్యలు మూసీని మంచినీటి నదిగా మారుస్తాయి. ప్రభుత్వం ఈసా-మూసీ సంగమాన్ని ప్రపంచస్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంతో హైదరాబాద్‌కు మౌలిక సదుపాయాలు, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతాయి. ఇది స్థిరమైన పట్టణ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. బఫర్ జోన్‌లోని మధుపార్క్ రిజ్ అపార్ట్‌మెంట్స్ వంటి ప్రాంతాల్లో నివాసుల ఆందోళనలు సహజం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరిస్తోంది. గవర్నమెంట్ విలువ రూ. 3,000 ఉన్నప్పటికీ, స్క్వేర్ ఫీట్‌కు రూ.5,000 పరిహారం ప్రకటించడం ప్రజాహిత దృక్పథాన్ని చాటుతుంది. ఇల్లు కేవలం ఆస్తి కాదు.. కుటుంబాల ఆశలు. పారదర్శకత, న్యాయం, సముచిత పరిహారంతో పునరావాసం అందించడం ప్రభుత్వ సంకల్పం.

బాధితులతో చర్చలు జరుపుతూ, వారికి నష్టం జరగకుండా చూస్తోంది. ఇది గత పాలనలతో పోలిస్తే భిన్నమైన, మానవీయ విధానం. కేంద్ర రక్షణ శాఖనుంచి 98.20 ఎకరాల భూమి కోరుతూ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలు ప్రాజెక్టును త్వరగా అమలు చేయడానికి దోహదపడతాయి. ప్రభుత్వం ప్రజల బతుకులను కాపాడుతూ అభివృద్ధిని సాధిస్తోంది. ప్రతిపక్షాలు భూసేకరణ, పారదర్శకతపై విమర్శిస్తున్నాయి. కానీ మూసీ కాలుష్యం ఏ ప్రభుత్వానికీ పరిమితం కాదు. గత సంవత్సరాల్లో తగిన చర్యలు లేకపోవడం వాస్తవం. ఇప్పుడు చేపట్టిన సమగ్ర చర్యలను రాజకీయంగా అడ్డుకోవడం ప్రజలకు అనుకూలం కాదు. సబర్మతి, గంగా ప్రక్షాళనలను సమర్థించినవారు మూసీకి వ్యతిరేకంగా మాట్లాడటం సందేహాలు కలిగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లాభనష్టాలకు అతీతంగా నగర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రజల శ్రేయస్సుకు మాత్రమే. చివరగా, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనా పరిపక్వతకు, ప్రజాకేంద్రీకృత పాలనకు ప్రతీకగా నిలుస్తోంది.

ఇది కేవలం ఒక స్మారక నిర్మాణం కాదు; చరిత్రను సంరక్షిస్తూ, పర్యావరణాన్ని పునరుద్ధరిస్తూ, భవిష్యత్ తరాలకు సురక్షిత నగరాన్ని అందించే సమగ్ర దృష్టికోణం. మూసీ పునర్జీవనం ద్వారా హైదరాబాద్‌ను వరద ముప్పు నుంచి రక్షించడం, గాంధీజీ స్ఫూర్తిని సజీవంగా నిలుపుకోవడం, అభివృద్ధి పునరావాసం మధ్య సమతౌల్యం పాటించడం ఇవన్నీ కలిసి బాధ్యతాయుత పాలనకు ఉదాహరణగా నిలుస్తాయి. ప్రజల ఇళ్లకు అన్యాయం జరగకుండా, న్యాయమైన పరిహారం, పారదర్శక విధానాలతో ముందుకు సాగడం కాంగ్రెస్ ప్రభుత్వ కట్టుబాటును చాటుతోంది.అభివృద్ధిని రాజకీయఅద్దంలో చూడటం సులభం, కానీ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం నిజమైన నాయకత్వం. ప్రజాహితమే పరమావధిగా, సామాజిక న్యాయమే మార్గదర్శకంగా తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుతో మరో మైలురాయిని నెలకొల్పుతోంది.

– అమరవాజీ నాగరాజు

(టిపిసిసి చీఫ్ పిఆర్‌ఒ)