
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తన ఆర్కే ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం మహిళా కబడ్డీ. ఈ చిత్రంలో ఇండియన్ ఉమెన్స్ కబడ్డీ టీమ్ వైస్ కెప్టెన్ పూజ నర్వాల్, ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, హీరో సుమన్, అక్సాఖాన్, తులసితో పాటు ఏడుగురు రియల్ కబడ్డీ ప్లేయర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో పూజ నర్వాల్, శ్రీనివాస్ రెడ్డి, సుమన్, అక్సాఖాన్, తులసి, దర్శక నిర్మాత డా.ఆర్కే గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజ నర్వాల్ మాట్లాడుతూ “మహిళలకు ప్రో కబడ్డీ లీగ్ కూడా ప్రారంభం కాబోతోంది. కబడ్డీని ప్రొఫెషనల్ గా ఎంచుకునే అమ్మాయిలకు మంచి భవిష్యత్ ఉంటుంది.
ఇలాంటి సమయంలో ‘మహిళా కబడ్డీ’ అనే సినిమాను ఆర్కే గౌడ్ రూపొందిస్తుండటం, ఇందులో నేను కూడా నటించడం సంతోషంగా ఉంది”అని అన్నారు. దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ “పల్లెటూరి నుంచి వచ్చిన ఒక పేద అమ్మాయి కబడ్డీ ఆటలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా పేరు తెచ్చుకుంది, ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అనే కథాంశంతో ‘మహిళా కబడ్డీ’ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. రియల్ కబడ్డీ ప్లేయర్స్ మా మూవీలో నటించబోతున్నారు. కోచ్‌గా శ్రీనివాస రెడ్డి నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషలలో రూపొందించే ఈ సినిమాలో అక్సాఖాన్ తో మరో హీరో హీరోయిన్ ని కూడా ఎంపిక చేశాను. వీరితో పాటు సుమన్, ఆమని, ఇంద్రజ నటిస్తున్నారు. త్వరలోనే మా చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తాం”అని తెలిపారు.