
సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం భారతదేశం. ప్రత్యేకంగా సంస్కృతి, సంప్రదాయాలను ఆచరిస్తూ, అనుసరిస్తూ అదనంగా కొన్ని ప్రత్యేక తేదీల ద్వారా గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీని ద్వారా చరిత్ర తెలుసుకొని మన జీవిత విధానం సరైన మార్గంలో పయనించే విధంగా చేస్తున్నాం. ఇలా కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఒకటి. మన దేశంలో ప్రతీ ఏటా ఫిబ్రవరి 28 వ తేదీని జాతీయ సైన్సు దినోత్సవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. రామన్ ఎఫెక్ట్ రూపుదాల్చిన సందర్భంగా మనం దాని ప్రత్యేకతను తెలుపుకుంటూ రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న వ్యక్తి సివి రామన్‌ని, వారి సేవలను గుర్తుకు తెచ్చుకుంటున్నాం. సివి రామన్ పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకటరామన్. చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతీ అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. సివి రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు.
తండ్రి భౌతిక అధ్యాపకులు కావడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించారు. 1907 లో ఎంయస్‌సి ఫిజిక్స్ లో యూనివర్శిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 18వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో రామన్ ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేలింది. 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ బ్రిటీష్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ… రామన్ సైన్స్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు.
కానీ, బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్‌తో పెళ్ళయింది. పరిశోధనలపై ఉన్న ఆసక్తివలన తెల్లవారుజామున ఐదున్నరకే పరిశోధనలు చేయడం ప్రారంభించేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు, సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్శిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1921లో లండన్‌లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్దరహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చాడు. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మార్చాడు.
కలకత్తా చేరగానే ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కెఆర్ రామనాథన్, కెయస్ కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కెయస్ కృష్ణన్ రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్‌కు నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే రామన్ చాలా మంచి వార్త చెప్పారు అని సంతోషపడ్డారు. కాంప్టన్ ఫలితం ఎక్సరేయిస్ విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాలు లేకపోయినా రామన్ తన ఆలోచనకు ప్రయోగరూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు. అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించాడు.
అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. వీరి పరిశోధన విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో ‘భారతరత్న’ అవార్డు బహూకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ ‘విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మథించి వేస్తాయి’ అన్న మాటలు నేటికీ ఆలోచింపచేస్తాయి. చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మన మధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి. 1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యం చేయకుండా సైన్స్ ను నిర్లక్ష్యం చేయకుండా పట్టుదలతో చదివి వాటి విలువలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా కృషి చేయాలి.
– టి. సంయుక్తా కృష్ణమూర్తి
85001 75459
-నేడు జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా