
విసుగులేని విక్రమార్కుని వలే సుప్రీం కోర్టు మరొక మారు ఉచితాల భేతాళుని శవాన్ని భుజాన వేసుకుని బయలుదేరింది. ఫిబ్రవరి 19న ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ప్రభుత్వాలు ఉచితాలను విచక్షణా రహితంగా ఎందుకు ప్రకటిస్తున్నాయి? ఎన్నికల ముందు ఆ పని ఎందుకు చేస్తున్నాయి? అర్హులైన పేదలకే గాక కొన్నింటిని అందరికీ చేయటం ఎందుకు? రెవెన్యూ లోటు పెరుగుతున్నా లెక్క చేయరా? ఇట్లా చేస్తూ పోతే అభివృద్ధి మాటేమిటి? ఇంతకన్నా ఉపాధి అవకాశాలు పెంచటం మంచిది. కదా? అని ప్రశ్నల పరంపరను గుక్క తిప్పుకోకుండా సంధించింది.
న్యాయమూర్తులను విసుగులేని విక్రమార్కులనటం ఎందుకంటే, ఇదే అంశంపై వేర్వేరు న్యాయమార్తులు హైకోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు ఇటీవలి సంవత్సరాలలో ఎన్నిసార్లు ప్రశ్నలు వేసారో లెక్కలేదు. అట్లా వేస్తూ వారికీ గుక్క తిరగలేదు. ఇపుడు వీరికీ తిరగలేదు. కాని వారికి ఎప్పుడు, ఏ ప్రభుత్వం నుంచి, ఏ రాజకీయ పార్టీ నుంచి సమాధానం వచ్చినట్లు లేదు. ఎవరైనా ‘పరిశీలిస్తాం’ అన్నారేమో తెలియదు. విచిత్రం ఏమంటే, ఉచితాలు ఒక పరిమితికి మించి సరికాదని, కేంద్రంలో, రాష్ట్రాంలలో పలు మార్లు అధికారం నెరపిన లేదా ఇంకా పాలిస్తున్న బిజెపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతో సహా అనేక పక్షాలన్నాయి. ఆర్థిక నిపుణులు, మేధావుల మాట చెప్పనక్కరలేదు. అయినప్పటికీ తిరిగి అవే పార్టీలు ప్రతి ఎన్నికలో పరస్పరం పోటీపడి డజన్లకొద్దీ ఉచితాలను వేర్వేరు వర్గాలను వెతికి మరీ ప్రకటించటం అందరం చూస్తున్నాం. న్యాయమార్తులు గమనించటం లేదనుకోలేము. అట్లా ప్రకటించటానికి కారణం ఏమిటో కూడా ఆయా పార్టీలు, ప్రజలతోపాటు న్యాయమూర్తులకు కూడా తప్పక తెలిసే ఉంటుంది. అయినా ఎందుకు ప్రశ్నిస్తున్నట్లు?
భేతాళ కథలు ఎట్లా నడుస్తాయో మనకు తెలుసు. విక్రమార్కుడు చెట్టుపైకెక్కి భేతాళుని శవాన్ని భుజంపై వేసుకుని నడవటం మొదలుపెట్టగా, ఆ శవం, “ఓ రాజా, నీకు అలసట లేకుండా ఉండేందుకు ఒక కథ చెప్తాను వినమంటుంది. ఆసక్తికరంగా సాగే ఆ కథ చెప్పిన తర్వాత విక్రమార్క రాజుకు కొన్ని ప్రశ్నలు వేస్తుంది. వాటికి సమాధానం తెలియకపోతే పరవాలేదు. కాని తెలిసీ చెప్పనట్లయితే ఆయన తలవేయ ముక్కలువుతుంది సుమా అని హెచ్చరిస్తుంది. విక్రమార్కుడు గొప్ప రాజు కావటమేగాక మేధావి, సూక్ష్మబుద్ధి. భేతాళుని ప్రశ్నలకు తేలికగా సరైన సమాధానాలు చెప్తారు. ఆ విధంగా రాజుకు మౌనభంగం కలగటంతో భేతాళుడు శవంతో సహా చెట్టెక్కుతాడు. అపుడు భారత దేశపు న్యాయమూర్తులు చెట్టుపై నుంచి శవాన్ని దింపేందుకు విసుగులేకుండా తిరిగి బయలు దేరుతారు. ఇదంతా లేనిదే ప్రజాస్వామ్యపు కథలు ఇక ఉండవు కదా.
ఉచితాల కథపై భేతాళుడు కోర్టులను ఏమి ప్రశ్నలు అడిగేదీ మనం చెప్పలేము. కాని పలానవి అడగవయ్యా అని మనం భేతాళునికి ఒక జాబితా ఇద్దాము. అవి సుమారు ఈ విధంగా ఉండవచ్చు. అయ్యా న్యాయమూర్తుల వారూ, మీరో ఇతర న్యాయమూర్తులో ఇటువంటి ప్రశ్నలనే మళ్లీ మళ్లీ వేస్తున్నారు గదా; అంతవరకు బాగానే ఉన్నది గాని, అసలు ఇన్నిన్ని ఉచితాల ప్రకటన ఎందుకు జరుగుతున్నదని మీ కనిపిస్తున్నది? అది సరికాదని, ఆర్థిక పరిస్థితిపై, అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని వివిధ పార్టీలు అంగీకరిస్తూనే ఆ పని ఎందువల్ల చేస్తున్నాయి? అర్హులైన వారికి సంక్షేమాలను మీరు సైతం కాదనటం లేదు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు ఉండిన సంక్షేమ రాజ్య భావనకు అనుగుణంగా అర్హత గల వర్గాలకు మాత్రమే ఉచితాలు లేదా రాయితీలు, రిజర్వేషన్లు వంటివి ఉండేవన్నది తెలిసిందే. ఆ దశ నుంచి కాలం గడిచినా కొద్దీ, క్రమక్రమంగా విచక్షణా రహితమైన ఉచితాల దశలోకి దేశం ఎందుకు ప్రయాణించింది? ప్రభుత్వాలు, పార్టీలు దేశాన్ని ఆ దశలోకి తీసుకు వెళ్లటానికి గల కారణాలు ఏమిటి? ఆ కొత్త దశ ఎపుడు, ఎందుకు వచ్చినట్లు?
న్యాయమూర్తులకు భేతాళుడు వేయవలసిన ప్రశ్నలలో ఇవి ఒక విధమైనవి. అవి ఇంతవరకు జరుగుతున్న వాటికి సంబంధించినవి. రెండవ విధమైనవి భవిష్యత్తుకు సంబంధించి. ఇపుడు కనిపిస్తున్న ఈ పరిస్థితులలో వారు లేవనెత్తిన వివిధ ప్రశ్నల దృష్టా మునుముందు జరగవలసిందేమిటి? విచక్షణా రహితమైన ఉచితాలు నిలిచిపోయేందుకు ప్రభుత్వాలు, పార్టీలు ఏమి చేయాలి? ఏ విధంగా? ఈ విషయమై కోర్టులు సూచనలు చేయటం మినహా తీర్పులు చెప్పటం, ఆదేశాలు జారీ చేయటం చట్టప్రకారం వీలయేది కాదు. కాని న్యాయమూర్తులు వ్యాఖ్యానాలు చేయగలరు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యాన అన్ని ప్రభుత్వాలు, పార్టీలు కూర్చుని సమాలోచనలు జరపవలసిందిగా సూచించవచ్చు. ఆ మార్గంలో పరిష్కారం లభిస్తుందనే హామీ లేదు. కాని కనీసం సందేశంలో ఒక చర్చ జరుగుతుంది. ఇంతకుముందు ఇతరత్రా రెండు సూచనలు వచ్చాయి. ఎన్నికల మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం పరిశీలించి అసాధ్యమైన వాటిని నియంత్రించాలన్నది ఒకటి. కోర్టులు ఆ పని చేయాలన్నది రెండు. ఇవిగాక, అధికారపార్టీలు అమలు జరపని హామీలను ప్రశ్నిస్తూ అపుడపుడు పౌరులు కోర్టులకు వెళుతున్నారు.
కాని ఈ అన్ని విషయాలలోనూ ఎన్నికల సంఘం, కోర్టులు నిస్సహాయతను ప్రకటిస్తూ రావటం తెలిసిందే. అందుకు తమకు అధికారాలు లేవన్నది అవి చెప్తున్నమాట. అది నిజమే కూడా. ఇదంతా గాక ఇటీవల మరొకటి కనిపిస్తున్నది. యథేచ్ఛగా హామీలివ్వటం, అవి అమలు కాకపోవటం, అవసరమైన అభివృద్ధిపరమైన, వాటికి నిధులు లేవని ప్రభుత్వాలు చెప్తుండటంతో ప్రజలకు పరిస్థితి క్రమంగా బోధపడుతున్నది. దానితో అక్కడక్కడ ప్రజల నుంచే తమకు ఉచితాలు అక్కరలేదు పనులు జరగాలనే మాట వినవస్తున్నది. ఆలోచనాపరులు, అటువంటి సంస్థలు ఈ ధోరణిని ఒక అవకాశంగా తీసుకుని ప్రజలను క్రమంగా కదిలిస్తూ, పిచ్చి పిచ్చి ఉచితాలను, పంపిణీలను ఆపివేసి అవసరమైన అభివృద్ధి జరపాలంటూ ప్రభుత్వాల పై ఒత్తిడి చేసినట్లయితే ఉపయోగం ఉండవచ్చునా? ఖచ్చితంగా చెప్పలేము. కాని అది ఒక అవకాశం కాగలదు.
మనం ప్రస్తావించుకున్న కథలో భేతాళుడు చేసిన హెచ్చరిక ఒకటున్నది. తన ప్రశ్నలకు సమాధానాలు తెలిసీ చెప్పనట్లయితే విక్రమార్క రాజు తల వేయి ముక్కలవుతుందని. కనుక, ఆ ప్రమాదాన్ని నివారించేందుకు న్యాయమూర్తుల పక్షాన మనం కొన్ని సమాధానాలు చెప్పుకునేందుకు ప్రయత్నిద్ధాము. స్వాతంత్య్ర సాధన సమయంలో సంక్షేమ రాజ్య భావన వెనుక అప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులుండేవి. స్థూలంగా చెప్పాలంటే అప్పటి పేదరికం, వెనుకబాటుతనం. అందుకు గురవుతున్న వర్గాలు నెమ్మదిగా పురోగమించేవరకు వారికి ప్రభుత్వాల నుంచి చేయూత తప్పనిసరి అనే ఆలోచనలు. ఒకవైపు ఆ పని జరుగుతూనే మరొక వైపు దేశాన్ని అన్ని విధాలుగా నికరంగా అభివృద్ధి చేయాలని, అట్లా జరిగినట్లయితే ఆ ఫలాలు నిమ్నవర్గాలకు కూడా అందుబాటులోకి వచ్చినా కొద్దీ రాగల కాలంలో వారికి చేయూతల అవసరం తగ్గుతూ పోతుందన్నది అంచనా. ఉచితాలు అక్కరలేకుండా వాళ్లను తమ కాళ్లపై నిలిచేట్లు చేయడమన్నమాట.
కాని ప్రభుత్వాలు తమ అభివృద్ధి బాధ్యతలలో వరుసగా విఫలమవుతూ పోయాయి. అది చాలదన్నట్లు పరిపాలనా వైఫల్యాలు, అవినీతి, బంధుప్రీతి, ధనిక వర్గాలకు అనుకూలమైన విధానాలు అంతటా కనిపించాయి. అటువంటి పరిస్థితులలో సహజంగానే పేదరికం, వెనుకబాటుతనం నిర్మూలనలు నత్తనడకనసాగాయి. అది ఆ వర్గాలలో అసంతృప్తిని పెంచసాగింది. నిరసనలు పెరగటం మొదలైంది. వీటి ఫలితంగా అధికార పక్షాలు ఓడటం కనిపించింది. సమస్య ఏమంటే, వారు కనీసం అప్పటికైనా మేల్కొని తమ విధానాలను, ఆచరణను మార్చుకుని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కాని అందుకు బదులు, తమ స్వార్థాలను యధావిధిగా కొనసాగించారు. ప్రజాస్వామ్యంలో చైతన్యాలు, ఓటు హక్కు అన్నవి మార్చలేనివి గనుక, ప్రజలు వాటిని ఉపయోగించి తమను ఓడిస్తుండటంలో ఆందోళన మొదలైంది.
స్వాతంత్య్ర సమయపు సంక్షేమ రాజ్య భావన, కాలం గడిచిన కొద్దీ విచక్షణారహితమైన ఉచితాల దశలోకి ప్రవేశించటానికి మూలం సరిగా ఇక్కడ ఉంది. అధికారం కోసం గెలవాలి గనుక, గెలిచేందుకు ఓట్లు అవసరం గనుక, ఓట్లు సంపాదించేందుకు ప్రజలకు పోటా పోటీగా ఉచితాల ఆశలు చూపించటం మొదలుపెట్టారు. ఆర్థికశక్తి అందుకు తగినట్లు ఉండదు గనుక సహజంగానే ఆ ప్రభావం ఆర్థికరంగంపై, అభివృద్ధిపై పడటం మొదలైంది. అయినప్పుటికీ ఆ వలయంలో చిక్కుకున్న పార్టీలు వెనుకకు పోలేక, ముందుకు పోలేక ఉన్నాయి. విక్రమార్కుని నుంచి ఈ సరైన సమాధానాలు విన్న భేతాళుడు వెంటనే శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు.
– టంకశాల అశోక్ ( దూరదృష్టి)
– రచయిత సీనియర్ సంపాదకులు