Reading Time: 3 minutes

ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడి జరిగే అవకాశం ఉన్నందున భారత్ ప్రభుత్వం అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రజలు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా కోరడమైనది. 2025 డిసెంబర్ నుండి ఇరాన్‌లో పౌరసమాజం గౌరవప్రదమైన జీవితం, స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రం, చట్టబద్ధమైన ఆకాంక్షల కోసం ధైర్యంగా పోరాడుతుంటే అక్కడి అధికార గణం, సైన్యం, పోలీసు వ్యవస్థలు ప్రజలను దారుణంగా అణచివేస్తున్నందుకు కెనడా, జి-7 దేశాలు సైతం ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటన చేశాయి. ఆహార ధరలు, కరెన్సీ తరుగుదల, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో నిరాశ చెందిన ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టారు. తర్వాత జరిగిన పరిణామక్రమాలలో ఇస్లామిక్ ప్రభుత్వాన్నే అంతం చేయాలని తీవ్రమైన ఆందోళనలు మొదలయ్యాయి. ఇరాన్‌లో అంతర్గత పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తుంది. 21- ఫిబ్రవరి -2026 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే ఇరాన్ అత్యున్నత నేత అయతొల్ల అలీ ఖమేనీ పరిపాలనకు వ్యతిరేకంగా అనేక విశ్వవిద్యాలయాలలో నిరసనలు జరిగాయి.

గత నెలల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలలో పాల్గొని భద్రత దళాల చేతిలో హతమైన ప్రజలను స్మరించుకుంటూ ఆందోళనలు జరిగినట్టు తెలుస్తుంది. టెహ్రాన్‌లోని షరీఫ్ సాంకేతిక విశ్వవిద్యాలయ విద్యార్థులు అయతొల్ల అలీ ఖమేనీ అత్యంత క్రూరమైన నాయకుడనే నినాదాలతో నిరసన తెలుపుతూ ఇరాన్ మాజీ రాజు షా కుమారుడైన రెజా పహ్లావి ఇరాన్ అత్యుత్తమ నేత పదవి అలంకరించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో ప్రభుత్వ మద్దతుదారులైన ‘బసీజ్’ (ప్రభుత్వ పారా మిలటరీ / స్వచ్ఛంద మద్దతుదారులు) వివిధ ప్రాంతాల్లో నిరసన చేస్తున్న విద్యార్థులతో గొడవపడ్డారు. టెహ్రాన్‌లోని షాహిద్ బెహెష్టి, అమీర్ కబీర్ విశ్వవిద్యాలయాలతోపాటు ఈశాన్య ప్రాంతంలోని మషద్ విశ్వవిద్యాలయంలో కూడా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగాయి. ఇలాంటి నిరసనలు 1979 నాటి ఇస్లామిక్ విప్లవంలో జరిగిన వాటిని తలపిస్తున్నాయి.

అమెరికా విధించిన ప్రత్యక్ష ఆంక్షలు, పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల ఇరాన్‌లో ఆర్థిక సామాజిక సమస్యలు పెరిగిపోయాయి. ఫలితంగా దేశంలోని సామాన్య ప్రజలే బలవుతున్నారు. ప్రపంచ చమురు నిలువల్లో 10%, సహజ వాయువు నిలువల్లో 15% కలిగి ఉండి జింక్, రాగి కూడా విరివిగా లభిస్తుంది. 2026 నివేదికల ప్రకారం ప్రపంచంలోని 20 అతిపెద్ద సైనిక వ్యవస్థలలో ఇరాన్ 16వ స్థానంలో ఉన్నది. యూరోపియన్ యూనియన్, ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జిసి (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్) ని అధికారికంగా ఉగ్రవాద జాబితాలో చేర్చింది. ఫలితంగా ఐఆర్‌జిసికి చెందిన సైనికుల, అధికారులపై నిషేధం, నిధులు, ఆస్తులు యూరోపియన్ యూనియన్ దేశాలలో స్తంభించిపోతాయి. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ఒక్క దేశం సైన్యం ఉగ్రవాద జాబితాలో చేర్చబడలేదు. తీవ్రవాద సంస్థలు తప్ప, కానీ మొదటిది ఇరాన్ ఐఆర్‌జిసి మాత్రమే. ఇప్పటివరకు యూరోపియన్ యూనియన్ జాబితాలో 13 మంది వ్యక్తులు, 23 సంస్థలు ఉగ్రవాద జాబితాలో ఉన్నాయి. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, ఐఆర్‌జిసి అంతర్జాతీయ అనుసంధాన వ్యవస్థ చాలా మటుకు దెబ్బ తింటుంది.

ఐఆర్‌జిసి ని 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత స్థాపించారు. దీని ప్రధాన లక్ష్యం నిరంతరం ఇస్లామిక్ వ్యవస్థను కాపాడటం, ఇస్లామిక్ విప్లవాన్ని రక్షించడం. ఐఆర్‌జిసి కేవలం ఇరాన్ అత్యున్నత నేత అయతొల్ల అలీ ఖమేనీకి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. దేశంలోని ఇతరులెవరికీ జవాబుదారీగా ఉండదు. దేశంలో ఇది సైనిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అత్యంత శక్తివంతమైనది. ఐఆర్‌జిసి పాలస్తీనా, యెమన్, సిరియా, ఇరాక్ దేశాలలోని తీవ్రవాద సంస్థలకు, హెజ్బుల్ల, హౌతి వంటి తీవ్రవాద తిరుగుబాటు సంస్థలకు ఆర్థిక, సైనిక సహాయం చేస్తుంది. అమెరికా బెదిరింపుల నేపథ్యంలో ఐఆర్‌జిసి ఈ మధ్యనే చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హార్మోజ్ జలసందిలో భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఇరాన్ మద్దతుదారైన రష్యా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సైనిక వ్యవస్థను కలిగి ఉన్నది.

కానీ ఇరాన్, రష్యాలు మంచి స్నేహబంధంతో అనేక విషయాల్లో పరస్పరం సహకరించుకున్నప్పటికీ ఇరాన్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా అమెరికాతో ఘర్షణ పడేంత మిత్రదేశం కాదు. జూన్ 2025 లో అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై 12 రోజులో పరిమిత దాడి చేసినప్పుడు రష్యా దాడులను ఖండించింది తప్ప ప్రత్యక్షంగా ఏమీ చేయలేకపోయింది. ఎప్పుడూ స్వంత ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని భావించే చైనా ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, 3వ అతిపెద్ద సైనిక వ్యవస, ఇరాన్ చైనాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఇరాన్‌పై అమెరికా చేస్తున్న బెదిరింపులను ఖండిస్తున్నదే తప్ప ప్రత్యక్షంగా చేసింది ఏమీ లేదు. ఆర్థికంగా మనుగడ సాగించడం కోసం చైనాకు పెద్ద ఎత్తున చమురును విక్రయిస్తున్నది ఇరాన్. గమనించాల్సిన విషయం చైనాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి అమెరికాయే.

ఒక తుర్కీయే మాత్రం ఇరాన్‌కు బహిరంగంగా మద్దతిస్తూ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అదే అమెరికా విషయంలో మెత్తబడుతుంది. 13- జనవరి, -2026లో తుర్కియే ప్రపంచాన్ని హెచ్చరిస్తూ ఇరాన్ అంతర్గత విషయాలలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఇరాన్‌కు తన అంతర్గత సమస్యలు పరిష్కరించుకునే సత్తా ఉందని పేర్కొన్నది. ఇరాన్‌లో ఏం జరిగినా ఇస్లామిక్, అరబిక్ దేశాలు పెద్దగా స్పందించేటట్లు కనిపించడం లేదు. ప్రస్తుత ఇస్లామిక్ ప్రపంచం ఐక్యంగా లేదు. ఉమ్మడి ప్రయోజనాలు, ఉమ్మడి వ్యూహలు, నిర్ణయాత్మక యంత్రాంగం లేదు, ముఖ్యంగా అమెరికా ప్రభావానికి లోనవుతున్నాయి. సౌదీ అరేబియా మొదటినుండి ఇరాన్‌ను ప్రత్యర్థిగానే చూస్తుంది. వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్‌లు ఇరాన్‌లో ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ప్రపంచ చమురు మార్కెట్‌లో తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుందని అమెరికాకు నచ్చజెప్పుతున్నాయి. తమ దేశంపై మరోసారి దాడి గనుక జరిగితే మా లక్ష్యాలను, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపైకి మళ్ళిస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తుంది. అదే గనుక నిజమైతే అమెరికా నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవచ్చు. అంతర్గతంగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రజా నిరసనలు, దేశ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇరాన్ కూడా వెనుకాడకపోవచ్చు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ సర్వసత్తాక అగ్రరాజ్యం అమెరికాతో సమరం అంటే ఏ దేశానికైనా సవాలే. 2026 అమెరికా సైనిక బడ్జెట్ పరిశీలిస్తే 1.01 ట్రిలియన్ డాలర్లు. 2027 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్లుకు పెంచి కల్నల్ సైన్యాన్ని (పదాతి, వాయు, సముద్ర, అంతరిక్షంలో కూడా అన్ని విధాలుగా అన్ని వేళల్లో సర్వసన్నద్ధంగా ఉండి ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే సైన్యం) తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది. అలాంటిది లభ్యమవుతున్న 2024 లెక్కల ప్రకారం ఇరాన్ దేశ బడ్జెట్ 45 బిలియన్ డాలర్లు, రక్షణ బడ్జెట్ 10.3 బిలియన్ డాలర్లు అంటే ఆర్థికంగా, సైనికంగా, ప్రభావ పరంగా ఏ రకంగానూ మేటి అమెరికాకు సాటిరాని ఇరాన్ ఏ రకంగా అమెరికాతో తలపడినా భారీ నష్టం వాటిల్లక మానదు. అంతరిక్ష యుద్ధానికి అర్రులు చాస్తున్న అమెరికాను ఎదిరించడం ఇరాన్‌కు అంత సులువైన విషయమేమీ కాదు. ఈ మధ్యనే వెనెజువెలా అధ్యక్షుడు మధురోను వాళ్ల దేశంలోకి వెళ్లి ఆ దేశ సైన్యాన్ని ఏమార్చి అడ్డువచ్చిన వారిని అంతమొందించి ఎత్తుకొచ్చింది. గమనించాల్సిన విషయం బలవంతుడు యుద్ధంలో గెలవచ్చు. కానీ నష్టం ఇరుపక్షాల వైపు ఉంటుందనేది నిత్య సత్యం.

 – కావలి చెన్నయ్య

90004 81768