Reading Time: 3 minutes

ఉషోదయాన ఆహారాన్వేషణకు బయలుదేరిన పక్షికి సాయంత్రానికి గూటికి చేరాకే మనసు కుదుటపడుతుంది. తన గూడును చూసుకుని అది మురిసిపోతుంది. ఎంతో సాంత్వన పొందుతుంది. జీవన గమనానికి ఆధారంగా నిలిచి, తనకు రక్షణనిస్తున్న గూటిపట్ల ఆ పక్షికి ఎంతో ఆరాధన. ఇక బుద్ధి వికాసం కలిగిన మనిషికి ఇల్లంటే ఓ ప్రత్యేకమైన భావావేశం. మనిషికి ఇల్లంటే నాలుగు గోడలు, గదులు మాత్రమే కాదు. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో తీపిగుర్తులు. ఇల్లు ఆనందాల నిలయం, అనుభూతుల సంగమం. తల దాచుకోవడానికి, తన అవసరాలు తీర్చుకోవడానికి, కుటుంబంతో భద్రంగా జీవించడానికి ఆశ్రయమిచ్చే ఇల్లంటే మనిషికి మరోప్రాణం. సామాజిక గుర్తింపుకు ఆధారం, ఆత్మగౌరవ ప్రతీక. ఆర్థిక అంతరాలతో సంబంధం లేకుండా ప్రతి మనిషి తనకంటూ సొంతిల్లు వుంటే కష్టమో, సుఖమో అందులో తలదాచుకుంటూ భద్రంగా జీవితాన్ని గడపవచ్చుననే భావనను కలిగి వుంటాడు. మానవ పరిణామ క్రమంలో నిప్పు ఆవిష్కరణకు, చక్రం రూపకల్పనకు ఎంతటి ప్రాధాన్యత వుందో గృహానికి (స్థిర నివాసానికి) అంతే ప్రాధాన్యత వుంది.

పరిణామక్రమంలో స్థిర నివాసాలు (ఇండ్లు) ఉనికిలోకి వచ్చిన తర్వాతనే నదీతీరాల్లో నాగరికతలు వర్ధిల్లాయి. వ్యవసాయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. కుటుంబ వ్యవస్థ పటిష్టమైంది. బాంధవ్యాలు బలపడ్డాయి. వివాహ వ్యవస్థకు సామాజిక ఆమోదం లభించింది. మనిషికి స్థిరనివాసం ప్రత్యేక గుర్తింపునిచ్చింది.వేర్వేరు ప్రాంతాల్లో స్థిరనివాసాలతో భౌగోళిక విభజన జరిగి సమాజాలు రూపుదాల్చాయి. స్థిర నివాసంతో కుదుటపడిన మనిషి తన శక్తిని కేవలం జీవన పోరాటానికే కాకుండా, జ్ఞానం, కళలు, శాస్త్రాలు, సాంకేతికత, సామాజిక వికాసంపై దృష్టి కేంద్రీకరించగలిగాడు. ప్రపంచం ప్రగతి బాటలో పయనించింది. ఇల్లు మానవ వికాసానికి, సమాజాల పురోభివృద్ధికి కేంద్రంగా వుంటూ వస్తున్నది. అందుకే దారిద్య్రరేఖకు దిగువన వున్న ప్రజలకు వారికంటూ ఒక సొంత ఇల్లు వుండాలనే తలంపు కాంగ్రెస్ పార్టీకి మొదటినుండి వుంది. ప్రజలకు అన్నవస్త్రాలు, ఉపాధి కల్పించడం ఎంత ముఖ్యమో, భద్రమైన నివాసం కల్పించడమూ అంతే కీలకమని కాంగ్రెస్ పార్టీ భావించింది.

కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు గృహం అనే అంశాన్ని కేవలం సంక్షేమ అంశంగా మాత్రమే పరిగణించలేదు. ప్రభుత్వసామాజిక బాధ్యతకు కొలమానంగా భావించింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఓ వైపు ఆహార పథకాలను, కనీస వేతన చట్టాలను, సమగ్ర ప్రగతి కార్యక్రమాలెన్నో అమలు చేస్తూనే, మరోవైపు వారికి శాశ్వత ఆశ్రయ కల్పనకు హౌసింగ్ బోర్డులు; దారిద్య్రరేఖకు దిగువనున్న వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు రుణాలు, హౌసింగ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, పునరావాసా పథకాలకు నిధుల అందజేత వంటి కార్యక్రమాలకు హడ్కో వంటి కార్పోరేషన్లు, గృహ నిర్మాణ పరిశోధలకై నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్, పేదవర్గాలకు ఆవాసమే లక్ష్యంగా సైట్స్ అండ్ సర్వీసెస్ స్కీమ్ వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఇవేకాకుండా ఇందిరా ఆవాస్ యోజన, జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్, ఇందిరా ఆవాస్ యోజన, రాజీవ్ ఆవాస్ యోజన వంటి ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలుచేసింది. దారిద్య్రరేఖకు దిగువునున్న కోట్లాది మంది ప్రజల సొంతింటి కలను నెరవేర్చి, వారికి భవిష్యత్తు పై భరోసాను కల్పించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరిచిన గృహ నిర్మాణ పథకాలు దేశంలో కోట్లాది కుటుంబాలకు నివాస భద్రతను అందించాయి. దీని ప్రభావం కేవలం ఇంటి నిర్మాణంతో ఆగలేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉపాధి పెరగడం, స్థానిక నిర్మాణ రంగానికి ఊతం, బాలబాలికలకు స్థిరమైన విద్యావకాశాలు, మహిళా భద్రత -ఇలా అనేక స్థాయిల్లో దీర్ఘకాలిక ఫలితాలు కనిపించాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సామాజిక మార్పు సాధనంగా, సమాజ నిర్మాణ దృక్కోణంలో ఒక ముఖ్యమైన అంశంగా బడుగు, బలహీన వర్గాలకు సొంతిల్లు అనే అద్భుతమైన కార్యక్రమాన్ని తాము అధికారంలో వున్న ప్రతి రాష్ట్రంలో కొనసాగిస్తూ వస్తున్నది. పేదరిక నిర్మూలనకు, సామాజిక అసమానతల తగ్గింపుకు, మానవ గౌరవ పరిరక్షణకు సంబంధించిన ఒక విధాన నిర్ణయంగా దీన్ని అమలు చేసింది. గతంలో కాంగ్రెస్ పాలనలో ఈ రెండు పథకాల ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన స్ఫూర్తితో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారంటీల్లోని ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకం ద్వారా ప్రజల సొంతింటి కలను తీరుస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కొలువుదీరాక ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలోని నిరుపేద వర్గాలకు ఈ పథకం ద్వారా దశాబ్దాల వారి సొంతింటి కలను పకడ్బందీ ప్రణాళికతో ముందుకు తీసుకెళ్ళింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా 2028 నాటికి 20 లక్షల ఇండ్లను నిర్మించే లక్ష్యంతో నాలుగు విడతలుగా అమలుచేస్తున్న ఈ పథకంలో మొదటి విడతలో భాగంగా 4.50 లక్షల ఇండ్లను కట్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున (గిరిజన ఆవాసాలు, ఐటిడిఎ పరిధిలో అదనంగా 1000 ఇండ్లు) ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది. పలు ఇంజనీరింగ్ శాఖల పర్యవేక్షణలో ఉన్న డబుల్ బెడ్ రూం ప్రాజెక్టులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోకి తెచ్చి కట్టుదిట్టంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు పూర్తి కాగా, పలుచోట్ల గృహప్రవేశాలూ జరిగాయి. మరో లక్షన్నర వరకు ఇందిరమ్మ ఇండ్లకు త్వరలో గృహప్రవేశాలు జరగనున్నాయి.

ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంత స్థలాన్ని కలిగి వుండి, దారిద్య్రరేఖకు దిగువన వున్న అర్హులైన లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి వంద శాతం సబ్సిడీతో 5 లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందిస్తున్నది. ఎస్‌సి, ఎస్‌టిలకు మరో లక్ష రూపాయలు అదనంగా కలిపి 6లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందుతున్నాయి. మరోవైపు సొంత జాగా లేని నిరుపేదలకు ప్రభుత్వం సర్వం తానేయై ఉచితంగా ఇండ్లను నిర్మించి అందిస్తున్నది. సిఎం రేవంత్‌రెడ్డి ఆశయాల మేరకు ఇందిరమ్మ ఇండ్లను ఇంటి ఇల్లాలి పేరు మీద రిజిస్టర్ చేయించి అందించడం ద్వారా మహిళా సాధికారతను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేతల్లో చూపుతున్నది. అర్హులైన ప్రతి లబ్ధిదారునికీ ఇంటిని అందించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా చేపట్టింది. ఇందిరమ్మ ఇండ్లతో సామాన్యుడి జీవించే హక్కుకు సార్థకత చేకూరింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్రంలో సంక్షేమంలో స్వర్ణయుగం ఆవిష్కృతం కానున్నది.

– బిల్లా అజయ్ కుమార్

78350 79439