
ఎన్నో ఆటుపోట్లు, అవాంతరాల మధ్య న్యూఢిల్లీ వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం భారత దేశ ప్రయోజనాలకు భంగకరంగా ఉందని కొందరు, ట్రంప్ స్వదేశంలో ఎదురవుతున్న నిరసనలకు తలవొగ్గి భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారని మరికొందరు వాదించడం గమనార్హం. ఇది భారత్ సాధించిన విజయమని బిజెపి అనుకూల పక్షాలు భాష్యం చెబుతుంటే, మోడీ ట్రంప్ ఒత్తిళ్ళకు లొంగిపోయి రాజీపడ్డారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏది నిజం? ఏది అబద్ధం? అనే అంశం ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుంది. ఏదిఏమైనప్పటికీ ట్రంప్ కనీస మర్యాద, దౌత్య విలువలు పాటించకుండా ఏక పక్షంగా వాణిజ్య ఒప్పందం కుదిరిందని చెప్పడమే కాకుండా, ప్రతీ విషయాన్ని ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించడం సముచితం కాదు. భారత్ కూడా ట్రంప్ పోకడలపై తగిన వివరణ ఇవ్వకపోతే ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తే అవకాశముంది. ఇండో- యుఎస్ ‘ట్రేడ్ డీల్’లో కొన్ని సవరణలు చేస్తూ అమెరికా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. 500 బిలియన్ డాలర్ల అమెరికా వస్తూత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందనే ప్రకటనలో కొంత సవరణ చేయడమే కాకుండా భారత్ నుండి దిగుమతి చేసుకునే పప్పుధాన్యాలపై సుంకాలు తగ్గుతాయనే పదజాలంలో కూడా సవరణలు చేస్తూ కొత్త ఫ్యాక్ట్‌షీట్‌లో అమెరికా పేర్కొనడం జరిగింది.
భారత్‌తో ట్రేడ్‌డీల్‌పట్ల పాక్ సహజం గానే ఆత్మరక్షణలో పడింది. అమెరికా తమను టాయ్ లెట్ పేపర్‌లా వాడుకుని, వదిలేయడం పట్ల పాక్ రక్షణ మంత్రి ఆవేదన చెందడం సహజమే. ఉన్నట్టుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో ఎందుకింత మార్పు వచ్చింది? భారతీయ వస్తువులపై సుంకాలను 18 శాతం ఎందుకు తగ్గించారు? ఇప్పటి వరకు నాన్చిన అమెరికా- భారత్ ట్రేడ్ డీల్‌ను ట్రంప్ ఎందుకు ఆమోదించారు? ట్రంప్ ట్రేడ్ డీల్ లో నిజాయితీ ఉందా? అసలు తెరవెనుక ఏం జరిగిందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఇరుదేశాల మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ వలన ఎవరికి లాభం? ఎవరికి నష్టం అనే అంశాలను పరిశీలిస్తే ఇరు దేశాలకు ఈ ఒప్పందం వలన ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. ట్రంప్ ప్రకటనకు మోడీ అంగీకారం తెలియజేసిన నేపథ్యంలో ఈ ఒప్పందం భారతీయ రైతులకు శాపంగా ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల వస్తూత్పత్తులను కొనడం విశేషమేమీ కాదని భారత్ ప్రకటించింది. మోడీ అభ్యర్థనతోనే తాను ట్రేడ్ డీల్‌కు ఒప్పుకున్నానని, రష్యా నుండి చమురు కొనుగోలు నిలుపుదల చేయడానికి, వెనెజువెలా నుండి చమురు కొనుగోలుకు భారత్ అంగీకరించడం వలన ఈ ఒప్పందాన్ని అంగీకరించడం జరిగిందని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో వెల్లడించగా, సుంకాలను తగ్గించడం పట్ల, ట్రేడ్ డీల్ పట్ల మోడీ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.
ట్రంప్ చెప్పినట్లుగా రష్యా చమురు నిలిపి వేస్తామని గాని, వెనెజువెలా నుండి చమురు కొనుగోలు చేస్తామని గాని భారత ప్రధాని చెప్పలేదు. రష్యా కూడా భారత్ నుండి చమురు విషయంలో తమకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొనడం విశేషం. ట్రంప్ మాటల్లో వాస్తవమెంత? భారత్ నిజంగానే రష్యా నుండి చమురు కొనుగోలు నిలిపివేసి, ప్రస్తుతం అమెరికా అధీనంలో ఉన్న వెనెజువెలా నుండి ఆయిల్ దిగుమతి చేయనుందా? అనే విషయాలపై భారత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికైతే ఇండో- యుఎస్ మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైనది. ఈ ఒప్పందం మార్చి నెల నుండి అమల్లోకి రాబోతున్నది. యూరోపియన్ యూనియన్‌తో భారత్ చేసుకున్న ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’ కూడా ఏ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కాని అమల్లోకి వస్తుంది. భారత్‌పై ఆగ్రహంతో రగిలి పోయిన ట్రంప్ స్వరం మార్చి మోడీని ప్రశంసించడమే కాకుండా అమెరికా- భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దంలోనే అతి పెద్ద చారిత్రక ఒప్పందంగా అభివర్ణించడం జరిగింది. భారత్‌తో తాము జరిపే 500 బిలియన్ డాలర్ల వాణిజ్యం జీరో సుంకాలతో జరగబోతుందని చెబుతున్న ట్రంప్, భారతీయ వస్తువులపై 18 శాతం సుంకాలు విధించడం ఇరుదేశాల వాణిజ్య వ్యవహారాల్లోని అసమతుల్యతను, భారత్ పట్ల అమెరికా చూపుతున్న వాణిజ్య వివక్షను చాటి చెబుతున్నది.
భారత్- ఇయు దేశాల ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ పట్ల అప్రమత్తమైన ట్రంప్ ఒక మెట్టుదిగి, పట్టుదల వదలి భారత్‌తో ట్రేడ్ డీల్‌కు పచ్చజెండా ఊపినట్లు అవగతమవుతున్నది. అమెరికాలో ట్రంప్ పట్ల వ్యతిరేకత ఏర్పడడం, ద్రవ్యోల్బణం పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం, అమెరికా మిత్రదేశాలు ట్రంప్‌కు వ్యతిరేక గళం వినిపించడం, అమెరికా విధించిన రెసిఫ్రోకల్ టారిఫ్‌లను, అధిక సుంకాలను చైనా వంటి దేశాలు లెక్కచేయకపోవడం, రష్యా ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించడంతోపాటు అనేక అంశాలు, స్వీయ తప్పిదాలు ట్రంప్ పట్ల వ్యతిరేకతను పెంచాయి. ముఖ్యంగా భారత్‌పై 50% సుంకాలు విధించడం, ఇందులో రష్యా నుండి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకే ఏకంగా 25 శాతం అదనపు సుంకాలను విధించిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఈ సుంకాలను 18. శాతానికి పరిమితం చేయడం శుభసూచకం. మన పొరుగునున్న చైనా, బంగ్లాదేశ్, పాక్‌లపై 37, 20, 19 శాతం సుంకాలను విధించిన అమెరికా తన మిత్ర దేశాలపై కూడా భారత్ కంటే ఎక్కువ సుంకాలు విధించిన దేశాల జాబితాలో ఉన్నాయి. బ్రెజిల్‌పై 50%, మయన్మార్ పై 40% టారిఫ్‌లు విధించిన అమెరికా ఇప్పుడు భారత్ విషయంలో పన్నుల భారం తగ్గించడం క్షీణిస్తున్న ఇండో- యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకొనే చర్యల్లో ఒక భాగమే.
అమెరికా మొండి పట్టుదల వలన ఇప్పటికే యూరోపియన్ యూనియన్ అమెరికాకు దూరం కావడం జరిగింది. అమెరికా శత్రుదేశాలను, మిత్రదేశాలనే కాకుండా భిన్న ధ్రువాలైన ఇరాన్, ఇజ్రాయెల్ పాలస్తీనా లతోపాటు, అరబ్ ఎమిరేట్స్‌తోను భారత్ తన ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నది. దీనిని భారత్ దౌత్యనీతిగా భావించాలా? లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా మోడీ అమెరికా హెచ్చరికలకు లొంగిపోయారా? అనే సంశయం తొలగిపోలేదు. ఆవేశకావేషాలు, ప్రతీకార చర్యలు, పంతాలు, పట్టింపులు భారత ఆర్థ్ధికాభివృద్ధికి గొడ్డలివేటు. ఈ విషయాన్ని గమనించే భారత్ ప్రపంచ దేశాలన్నింటితోను సఖ్యతను కొనసాగిస్తున్నది. అమెరికా వలన భారత్‌కు రష్యాతో గల రక్షణ, వాణిజ్య, సాంకేతిక సంబంధాలతో పాటు చారిత్రక, సన్నిహిత సంబంధాలకు విఘాతం కలగకుండా కాపాడుకోవాలి. ఈ ప్రపంచంలో భారత్‌కు నమ్మదగిన ఏకైక దేశం రష్యా మాత్రమే. ఎన్ని అడ్డంకులెదురైనా రష్యాతో భారత్‌కు గల చిరకాల బంధాన్ని కొనసాగించాలి. ఈ విషయంలో అమెరికా ఒత్తిడిని భారత్ పరిగణనలోకి తీసుకోకూడదు.
ఇండో- అమెరికా ట్రేడ్ డీల్ వలన భారతీయ వస్తువులకు అమెరికా పెద్ద మార్కెట్‌గా అవతరించబోతుంది. భారతదేశంలో తగ్గబోయే వస్తువుల ధరలు, ఇంధన ధరల ప్రయోజనాలు నేరుగా వినియోగదారులకు దక్కాలి. భారతదేశంలో ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిల్వలున్న దేశంగా వెనెజువేలా పేరుగాంచింది. 800 సంవత్సరాలకు సరిపడా ఆయిల్ నిల్వలు గల వెనెజువెలాలో చమురు వెలికితీయడంలో హ్యూగోచావెజ్, మదురోలు విఫలమైనారు. ఇప్పుడు వెనెజువెలా అమెరికా కనుసన్నల్లో ఉండడం వలన ఆయిల్‌ను వెలికితీయడం సాధ్యం కావచ్చు. వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టాలని ఇప్పటికే ట్రంప్ భారత్, చైనాలను కోరడం జరిగింది. ఇది సాధ్యమా? ఏదిఏమైనప్పటికీ ట్రంప్ ధోరణిలో మార్పు వచ్చి ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం అభిలషణీయం. ఈ విషయంలో అమెరికా ఎలాంటి షరతులు విధించినా భారత్ అంగీకరించకూడదు. అలాగే భారతీయ ఉత్పత్తులపై విధించిన 18 శాతం సుంకాలను కూడా తొలగించి భారత్‌పై అమెరికా తనకున్న విశ్వసనీయతను ప్రపంచానికి చాటి చెప్పాలి.
రష్యా విషయంలో భారత్‌ను హెచ్చరించిన అమెరికా ఇప్పుడు రష్యాతో కూడా రహస్య ఒప్పందం కుదుర్చుకోబోతుందని కొన్ని వార్తా కథనాలు వెలువడ్డాయి. పెట్రో డాలర్ వ్యవస్థను రష్యా అంగీకరించి, చమురును డాలర్లలోనే విక్రయించబోతున్నదనే వార్తల్లో నిజానిజాలు తేలాలి. ఏదిఏమైనప్పటికీ యుద్ధాల వలన ప్రయోజనం లేదని, ఆయుధాలు ప్రజల ఆకలిని తీర్చలేవనే సత్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం ఆయుధాలతో, ఉగ్రవాదంతో, అగ్ర దేశాల అవసరార్ధ ప్రయోజనాల కోసం తన ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసుకున్న పాక్‌కు ప్రస్తుత ప్రపంచ పరిణామాలు గుణపాఠం కావాలి. ఇప్పటివరకు పాక్ సాయంతో, సైనిక మద్దతుతో చిందులేసిన బంగ్లాదేశ్‌లోని బిఎన్‌పి నాయకుడు తారిఖ్ రెహమాన్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తన స్వరం మార్చుకున్నట్టు కనబడుతున్నది. భారత్‌తో స్నేహ సంబంధాలను నెలకొల్పుకుంటానని, బంగ్లాదేశ్ ఆర్ధిక వ్యవస్థ పటిష్టతకు కృషి చేస్తానని ప్రకటించడం ముదావహం. ఈ పరిణామాలను బట్టి ఇక నుండి ప్రపంచం వాణిజ్య సంబంధాల చుట్టే తిరుగుతుందనే వాస్తవం బోధపడుతున్నది. అశాంతి, అలజడులతో ఏమీ సాధించలేమని ప్రపంచ దేశాలు గమనించాలి.
– సుంకవల్లి సత్తిరాజు
97049 03463