
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కులాల ద్వేషం, పెత్తందార్ల పెత్తనం అవశేషాలు ఇంకా బుసకొడుతున్నాయనడానికి ఈ నెల 19న నాగర్‌కర్నూల్ మండలం లోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దారుణ సంఘటనే ప్రత్యక్ష సాక్షం. జాతరలో జరిగిన చిన్న గొడవ చిలికిచిలికి గాలివానగా మారి ఓ పసికందు మృతికి కారణమైంది. జాతరలో నెలకొన్న రద్దీలో భక్తులకు, నిర్వాహకులకు మధ్య జరిగిన తోపులాటలో నిరుపేద రజకుడు చిల్కేశ్వరం గణేశ్, ఆయన భార్య మౌనికలను పక్కకు నెట్టేయడమే కాకుండా వారి రెండు నెలల కూతురును నిర్వాహకులు కాలితో తన్ని విసిరేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన వివిధ వర్గాల ఆందోళనలకు దారి తీసింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు నిరసన చేపట్టాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కుమ్మెర గ్రామం పెత్తందార్ల దాష్టీకానికి కంచుకోటగా గత ముప్ఫయ్యేళ్లుగా సాగుతోంది. పెత్తందార్లు ఎలాంటి అరాచకాలు సాగించినా వారిని ఎదిరించే సాహసం ఎవరికీ లేకుండా పోతోంది.
ఒకవేళ ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెడుతుంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ ఫిర్యాదు సరిగ్గా లేదని పోలీసులు తిప్పికొట్టారని, పైగా నిందితులకు ఫోన్ చేసి మీరు కూడా కేసు పెట్టాలని సూచించారని అనధికారికంగా తెలుస్తోంది. ఈ సంఘటనతో గత ముఫ్పయ్యేళ్లుగా పెత్తందార్లు సాగిస్తున్న దురాగతాలు ఇప్పుడిప్పుడే వెలుగు లోకి వస్తున్నాయి. కుమ్మెర గట్టు అనేది పూర్తిగా ప్రభుత్వ గైరాన్ భూమిలో ఉంది. ఆ గుట్టపై పెత్తందార్లకు ఎటువంటి సంబంధం లేదు. గట్టుపై పూజలందుకునే మల్లయ్య పూర్తిగా యాదవుల ఆరాధ్య దైవం. యాదవుల ఇంటిలో ఉన్న మల్లయ్య దేవుడిని జాతర ముందు గుడికి తీసుకొస్తారని, జాతర పూర్తికాగానే తిరిగి తమ ఇంట్లోకి తీసుకొస్తారని అక్కడి వారు చెప్పారు. అలాంటప్పుడు గుడికి, గట్టుకు, దేవుడికి ఎలాంటి సంబంధం లేని పెత్తందార్లు ఈ జాతర నిర్వాహకులుగా చెలామణి అవుతుండడం, వంద రూపాయల వంతున ప్రవేశ రుసుం వసూలు చేయడం అక్రమమని తెలుస్తోంది. ప్రవేశ రుసుం వంద రూపాయలు ఇవ్వకపోవడం వల్లనే రజకులైన గణేశ్ దంపతులను క్యూలోంచి నెట్టివేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ముఫ్ఫయ్యేళ్లుగా కుమ్మెర గ్రామంలోని బడుగు వర్గాలను పెత్తందార్లు ఏ విధంగా హింసిస్తున్నారో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే తెలుస్తుంది. కుర్వ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి గొర్రెలు మేత కోసం బీడు భూముల్లోకి అలా పెత్తందారి చెలకలోకి పోవడంతో గొర్రెల కాపరిపై పెత్తందార్లు దాడి చేసి గడీల ఇంట్లో తాళం వేసి బంధించే సంఘటన ముఫ్ఫైయేళ్ల క్రితం జరిగింది. గడీలో గొర్రెల కాపరి బందీయై తీవ్ర చిత్రహింసలకు గురయ్యాడు. ఇంత జరిగినా ఆ గ్రామంలో ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఇటువంటి దుర్ఘటన ఇటీవల ఒకటి జరిగింది. పెత్తందారి చేలో కుర్వసమాజానికి చెందిన పశువుల కాపరి పశువులు పడ్డాయన్న నెపంపై కర్రతో దాడి చేయడంతో పశువుల కాపరి చెయ్యి విరిగింది. ట్రాన్స్‌ఫారమ్‌కు అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న సాకు చూపి దాడికి పాల్పడినట్టు తెలిసింది. కుర్వ సామాజిక తరగతికి చెందిన అమ్మాయి పొలంలో ఉన్న తన అన్న, తండ్రి దగ్గరకు చద్ది తీసుకుని వెళ్తుండగా దారిలో కల్వర్టు వద్ద మద్యం సేవిస్తున్న పెత్తందారీ వ్యక్తులు అమ్మాయిని అటకాయించి లైంగిక దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటనలకు నిరసనగా ఆందోళన చేపట్టిన ప్రజా సంఘాల పైనే కేసులు పెట్టారంటే పెత్తందారులకు పోలీసులు ఎలా వత్తాసు పలుకుతున్నారో తెలుస్తుంది.
కుల దురహంకార సంఘటనలు జరగకుండా చూడాలని సుప్రీం కోర్టు అనేక సార్లు తన తీర్పుల ద్వారా హెచ్చరించినా, సమాజం లోని కరడుకట్టిన సంప్రదాయ వర్గాలకు కనువిప్పు కావడం లేదు. కులద్వేష కాటుకు బలైపోతున్న వారు ప్రధానంగా దళితులు, మహిళలే. ఇక కులద్వేషంతో ముడిపడి ఉన్న పరువు హత్యల సంఘటనల గురించి చెప్పనక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 5000 మంది మహిళలు, బాలికలు పరువు కోరలకే బలైపోతున్నారు. వీరిలో దాదాపు మూడింట ఒకవంతు మంది భారత్, పాకిస్తాన్‌లకు చెందిన వారే కావడం గమనార్హం. అయితే వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఏటా పరువు హత్యల సంఖ్య దాదాపు 20,000 వరకు ఉంటోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
తెలంగాణ లోని మిర్యాలగూడలో అగ్రవర్ణ కుటుంబానికి చెందిన అమ్మాయి, దళితుడిని ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి 2016లో పెళ్లి చేసుకున్నా ఆమె కుటుంబీకులు సహించలేక ఆమె భర్తను దారుణంగా చంపించిన సంఘటన సంచలనం కలిగించింది. ఇదే విధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు చెందిన 27 ఏళ్ల యువతి పరువు హత్యకు బలైపోయింది. కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన కేవలం ఒక గ్రామంలో జరిగిన చిన్న సంఘర్షణ అనుకోరాదు. ఆధునిక సమాజంలో జడలు విప్పుతున్న కులద్వేషానికి ప్రతిబింబం. వంద రూపాయల కోసం పసిప్రాణం బలిగొనడం అమానుషం. దైవదర్శనం కోసం వచ్చిన భక్తుల్లో తక్కువ ఎక్కువ కులాలని తేడాలు చూపించి అడ్డుకోవడం, అవమానించడం, మన సామాజిక నిర్మాణం ఎంత పతనావస్థలో ఉందో స్పష్టం చేస్తుంది. సర్వమానవ సౌభ్రాతృత్వం, భక్తి, ఆధ్యాత్మికత, ఆరాధన విషయంలో కుల మతాలు అడ్డురావని ప్రబోధించే పెద్దలు ఇలాంటి దురాగతాలకు ఏం సమాధానం చెబుతారు?