Reading Time: 2 minutes
Off The Record About Rajanagaram Mla Controversy Bathula Balaramakrishna Or Wife Venkatalakshmi Managing Official Duties

Off The Record : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరన్న గందరగోళం పెరుగుతోందట. అదేంటీ… అసెంబ్లీ ఎన్నికలైపోయి రెండేళ్ళు కావస్తోంది కదా…. ఇప్పుడీ కొత్త డౌటేంటి అంటారా…? ఎస్‌…. అక్కడి పరిస్థితులు అలాగే ఉన్నాయట. తాము ఎన్నుకున్నది ఎవర్నో వాళ్ళకే అర్ధంగాక నియోజకవర్గ ఓటర్లు తలలు బాదుకుంటున్నారట. గత ఎన్నికల్లో రాజానగరం నుంచి జనసేన తరపున ఎన్నికయ్యారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. కానీ… ఇప్పుడు నియోజకవర్గంలో ఆయనకు బదులుగా వ్యవహారాలన్నిటినీ ఎమ్మెల్యే భార్య వెంకటలక్ష్మి చక్కబెడుతూ షాడో ఎమ్మెల్యేగా మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఆమె రోజూ ఎమ్మెల్యే స్థాయిలోనే…ప్రజల్లో తిరుగుతూ శుభకార్యాలకు అటెండ్‌ అవడం, పరామర్శల్లాంటివి చేస్తున్నారు. సరే…. అలాంటి ప్రైవేట్‌ కార్యక్రమాలకు వెళ్తే తప్పేముందని అనుకుంటుండగానే…. ఇటీవల ఇంకొంచెం యాక్టివిటీ పెంచేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేకు బదులుగా పాల్గొనడం వివాదాస్పదం అవుతోంది. రఘుదేవపురం పాఠశాలలో అదనపు భవనాలను ఆమే ప్రారంభించారు. అలాగే…. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని కూడా పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యే చేయాల్సిన ఆ పనిని ఆయన భార్య నేరుగా గ్రామాల్లో లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి చెక్కులు ఇచ్చి రావడం విమర్శలకు దారి తీస్తోంది.

ఎమ్మెల్యే భార్యగా తప్ప వెంకటలక్ష్మికి ఎలాంటి అధికార హోదా లేనప్పటికీ యంత్రాంగం మొత్తం ఆమెకు సలాం కొట్టడం వివాదాస్పదం అవుతోంది. శాసనసభ్యుడికి భార్య అయినంత మాత్రాన…. ఆమే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేస్తారా..? అంటూ కూటమిలోని నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం టిడిపి ఇన్చార్జిగా ఉన్నారు. కనీసం ఆయన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదట. అందుకే రాజానగరం టిడిపి శ్రేణులు ఎమ్మెల్యే బలరామకృష్ణ మీద గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రస్టింగ్‌ మేటర్‌ ఏంటంటే….నేను వన్‌టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతానంటూ స్వయంగా బలరామకృష్ణే ప్రచారం చేసుకుంటున్నారట. అలా ఎందుకని అంటే….. 2029 ఎన్నికల్లో జనసేన తరపున తమకు టిక్కెట్‌ ఇస్తే…. వెంకటలక్ష్మి పోటీ చేస్తారని చెబుతున్నారాయన. దీంతో బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ ఏంటని ఆరా తీసేవాళ్లు పెరుగుతున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ నేతల గ్రావెల్‌ దోపిడీనే గత ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా వాడారు బత్తుల. ఎన్నికల ప్రచారం మొత్తం కొండల్ని పిండిచేశారన్న టాపిక్‌ చుట్టూనే నడిపారు. వీళ్ళు మళ్లీ గెలిస్తే.. గ్రామాల్లో ఎక్కడా కొండ అనేదే కనిపించిందని, గతంలో ఇక్కడ ఉండేవని చెప్పుకోవాల్సి వస్తుందంటూ విమర్శలు గుప్పించారు. కట్‌ చేస్తే…తాను ఎమ్మెల్యే అయ్యాక కూడా అదే పని చేస్తున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి.అధికారంలోకి వచ్చిన 16 నెలలకే దుమ్ము దులిపేశారని, ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని సొంత కూటమి నాయకులే అంటున్నట్టు చెప్పుకుంటున్నారు.

రాజానగరం మండలంలోని కొత్త తుంగపాడు, కొండగుంటూరు, కానవరం, జి.యర్రంపాలెం,సీతానగరం మండలం నల్లగొండ తదితర గ్రామాల సమీపంలో ఇప్పటికీ అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతోందని అంటున్నారు. రెండు మూడు ఎకరాలకు అనుమతి తీసుకుని పది ఎకరాల విస్తీర్ణాలలోని కొండను తొలిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అనుమతి ఉన్నచోట్ల పరిమితికి మించి గ్రావెల్ తవ్వకాలు జరిపి కోట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయి. నిత్యం వందలాది లారీలు ఇక్కడి నుంటి రాజమండ్రి, కడియం, కాకినాడ, రావులపాలెం, మండపేట, తదితర ప్రాంతాలకు గ్రావెల్‌తో తిరుగుతున్నాయని, దీనికి ఎమ్మెల్యే అండదండలున్నాయని ప్రత్యర్థులతో పాటు సొంత కూటమి నాయకులు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. వే బిల్లులు, ఇతర రసీదులు లేకపోయినా.. వీటిని చెక్ చేయడం లేదట. కొండల్ని మింగుతున్నారంటూ…. ఈ స్థాయిలో ఆరోపణలు పెరిగిపోవడం వల్లే… ఎమ్మెల్యే బలరామకృష్ణ పునరాలోచనలో పడ్డట్టు చెప్పుకుంటన్నారు. మరక మంచిదేనంటూ తాను కొనసాగకుండా…ఈసారి తన భార్యను నిలబెడితే…. వ్యతిరేకత అంతగా ఉండబోదని లెక్కలేసుకుంటున్నారట బత్తుల. అందుకే నియోజకవర్గంలో ఇప్పట్నుంచే తన స్థానంలో ఆమెను తిప్పుతూ ట్రైనింగ్‌ ఇస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి రాజానగరంలో. దీన్ని ఆసరా చేసుకుని ఆమె కూడా షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారంటూ కూటమి నేతలు మండిపడుతున్నారు. మిత్రుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్నందున బలరామకృష్ణ ఇక ముందు కూడా వెంకటలక్ష్మికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారా లేక కట్టడి చేస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.