Reading Time: 2 minutes
Beerakaya Telagapindi Curry Benefits For Lactating Mothers And Babies

Healthy Food: పురిటి గదిలో ఉన్న బాలింతలకు ఆహారం విషయంలో పెద్దలు ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. బిడ్డకు పాలు సమృద్ధిగా అందాలన్నా, తల్లి త్వరగా కోలుకోవాలన్నా బలమైన ఆహారం ఎంతో అవసరం. అటువంటి పౌష్టిక ఆహారాల్లో ‘తెలగపిండి’ది అగ్రస్థానం. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయ వంటకాన్ని బీరకాయతో కలిపి వండితే రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మరి ఈ అద్భుతమైన రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: AP High Court: యూనివర్సిటీల్లో పదవీ విరమణ వయస్సు కేసు.. వివక్షపూరితమేనన్న హైకోర్టు..

అసలు తెలగపిండి అంటే..
నువ్వుల నుంచి నూనెను వేరు చేసినప్పుడు వచ్చే పిట్టునే తెలగపిండి అంటారు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కేవలం బాలింతలకే కాదు, ఎముకల బలం కోసం, గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:
బీరకాయ ముక్కలు: 400 గ్రాములు

తెలగపిండి: 3 టేబుల్ స్పూన్లు

పాలు: అర కప్పు (కాచి చల్లార్చినవి)

ఉల్లిపాయ ముక్కలు: 1 కప్పు

వెల్లుల్లి రెబ్బలు: 2 టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి: 4 నుంచి 6

నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె: 3 టేబుల్ స్పూన్లు

తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కొత్తిమీర తగినంత.

తయారీ విధానం:
ముందుగా కడాయిలో నూనె వేసి వేడయ్యాక తాలింపు గింజలు వేయాలి. ఈ కూరకి నువ్వుల నూనె వాడితే రుచి అద్భుతంగా ఉంటుంది. అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించాలి. ఆపై ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గాక బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. బీరకాయలు చక్కగా ఉడికిన తర్వాత అందులోకి అర కప్పు పాలు పోయాలి. మంటను తగ్గించి (Sim లో పెట్టి) ఒకసారి కలపాలి. పాలు పోసిన వెంటనే తెలగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు సన్నటి సెగ మీద మగ్గనివ్వాలి. చివరగా పచ్చి కొబ్బరి తురుము (ఆప్షనల్), కొత్తిమీర చల్లుకుని దించుకోవాలి.

ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఈ కూర తినడం వల్ల బాలింతలలో పాలు సమృద్ధిగా పడతాయి. ప్రసవం తర్వాత తల్లులకు వచ్చే నడుము నొప్పిని తగ్గించి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇందులో మసాలాలు ఉండవు కాబట్టి కడుపు మంట లేకుండా సులభంగా అరుగుతుంది.

READ ALSO: India vs Zimbabwe: టీమిండియాలో ప్రక్షాళన.. నెక్ట్స్‌ మ్యాచ్‌లో ఆ స్టార్ ప్లేయర్‌కు ఉద్వాసన!