Reading Time: 3 minutes

ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు కేంద్ర బిందువు గ్రామపంచాయతీ ఎన్నికలు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో బిసి, ఎస్‌సి, ఎస్‌టి నాయకులు తమ కేటాయించిన రిజర్వేషన్ శాతం కంటే అధికంగా ఎన్నిక కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రిజర్వ్ కాని సీట్లలో కూడా గెలవడం గ్రామస్థాయి రాజకీయాల్లో చైతన్యం, స్వాభిమానానికి సూచిక. రాష్ట్ర రాజకీయ చరిత్రలో సామాజిక మార్పుకు సంకేతంగా, బహుజన వాదానికి ప్రతీకగా చెప్పవచ్చు. భారతదేశ సగటు కన్నా తెలంగాణలో అత్యధిక శాతం బిసి జనాభా ఉంది. వారి రాజకీయ ప్రాతినిధ్యం దశాబ్దాలుగా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బిసిల కోసం ‘డెడికేటెడ్ కమిషన్’ నియమించారు. సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ సర్వే జరిపింది.

అనంతరం బిసిలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్ విద్య ఉద్యోగ, స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపారు. దీనికి ఆమోదం లభించకపోవడంతో తక్షణం స్థానిక సంస్థల్లో 42 శాతం బిసి రిజర్వేషన్స్ అమలు చేయడానికి జిఒ 9 ను జారీ చేసింది. దీన్ని ఆధిపత్య కులాలు హైకోర్టులో సవాలు చేయడంతో బ్రేక్ పడింది. దీనికి ప్రధాన కారణం అగ్రకుల కుల రాజకీయ పార్టీల చట్టబద్ధం చేయకపోవడమే. బిసిల్లో ఉద్యమానికి దారితీసాయి. ఆ ఉద్యమ ప్రభావంతో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో బిసి, దళిత వర్గాల మధ్య ఒక కొత్త రాజకీయ చైతన్యం పెరిగి, పల్లెపోరులో అగ్రకులాలకు అభిముఖంగా స్థానిక రాజకీయ పోరు జరిగింది. బహుజనుల సామాజిక చైతన్యం ఒక నిశ్శబ్ద రాజకీయ విప్లవానికి పునాది వేసింది.

చరిత్రలో బహుజనుల అరుదైన గెలుపు

పంచాయతీ రిజర్వేషన్లు మొత్తం 50శాతం వరకే పరిమితం చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మహిళా రిజర్వేషన్లను కొత్తగా కేటాయిస్తూ జిఒ 46జారీ చేసింది. ఇందులో కూడా గతంలో కన్నా ప్రత్యేకించి సర్పంచ్ కోటాను 17 శాతానికి తగ్గించడంపై బిసి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఒక వైపు చట్టపరమైన 50% పరిమితి విధింపు, మరో వైపు గతంలో కన్నా బిసిల రిజర్వేషన్ శాతం తగ్గించినప్పటికీ జనరల్ స్థానాల్లో బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు పోటీచేసి తమ రిజర్వేషన్లకు అతీతంగా విజయకేతనం ఎగరవేశారు. గణాంకాల పరంగా పరిశీలించినట్లయితే రాష్ట్రంలో ఈ సర్పంచి ఎన్నికల్లో 86.4 శాతం మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి సామాజిక వర్గాలవారే విజయం సాధించారు. 13.6 శాతం మంది మాత్రమే జనరల్ అభ్యర్థులు గెలిచారని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. విజేతలైన 12,702 మందికిగానూ 36.9 శాతం మంది బిసిలు కాగా, ఎస్‌టిలు 29.3 శాతం, ఎస్‌సిలు 18.2 శాతం మంది కాగా, 13.6 శాతం మంది జనరల్ కేటగిరీ నుంచి ఎన్నికయ్యారనీ ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. తమకు రిజర్వు అయిన వాటి కంటే అధికంగా 166 స్థానాల్లో మహిళలు గెలిచినట్లు, యువత అత్యధిక స్థానాల్లో గెలిచారనీ రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

ఈ ఎన్నికల్లో ముఖ్యంగా జనరల్ స్థానంలో బిసిలు 50 శాతంపైగా గెలవడం బిసి వర్గాలల్లో స్పష్టమైన మార్పుకు నిదర్శనం. ఈ ఎన్నికల్లో వచ్చిన ప్రధాన మార్పులను పరిశీలిస్తే… డబ్బు పెట్టిన అగ్రకుల నాయకులు ఓడిపోయారు. ఇన్నాళ్లు రాజకీయంగా దూరంగా ఉన్న బిసి, ఎస్‌సి కులాలు ఉమ్మడిగా తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేశారు. జగిత్యాల జిల్లా, బుగ్గారం మండలం, సిరికొండ గ్రామంలో బిసి కులానికి చెందిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన పంచిత ధర్మరాజు అత్యధిక డబ్బులు పంపిణీ చేసినా అగ్రకుల ఓ పార్టీ నాయకునిపై ఒక ఓటు తేడాతో గెలుపొంది చరిత్ర సృష్టించాడు. తెలంగాణ ఓ గ్రామంలో గ్రామపంచాయతీలో వార్డు మెంబరు, సర్పంచ్ మొత్తంగా ఎస్‌సిలకు గెలుపొం ది రికార్డు సృష్టించారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి లలో ఇలాంటి అరుదైన గెలుపు తెలంగాణ రాజకీయ సామాజిక ఒక చిత్రాన్ని మార్చింది. వేల కోట్లు డబ్బులు ఖర్చుపెట్టిన అగ్రకుల పార్టీలకు అభిముఖంగా గెలుపొందడం తెలంగాణ చరిత్రలో ఇది మొదటిసారి.

ఉమ్మడి పోరాటాలతో ముందుకెళ్లాలి

కులగణన, బిసి రిజర్వేషన్స్‌కు అంశాలు సామాజిక సమీకరణకు దారితీసాయి. ఈ మార్పుకు ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న నికార్సైన బహుజన ఉద్యమాలు కొనసాగడమే. తెలంగాణ రాష్ట్రంలో బహుజన వర్గాలంతా తరతరాలుగా అగ్రకుల పాలకుల దోపిడీకి గురయ్యారు. ఈ క్రమంలో 90 శాతం బిసి, ఎస్‌సి, ఎస్‌టి బలగాన్ని బానిససంకెళ్ల నుంచి విముక్తి కలిగించాలి. ఇందుకై వారిని ఫూలే, అంబేడ్కర్, కాన్సీరాం దారిలో నడిపించడానికి డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆలోచన నుంచి మార్చు 31, 2025న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బిసి, ఎస్‌సి, ఎస్‌టిల ఐక్య కార్యాచరణ సమితి (జాక్) ఆవిర్భవించింది. దీనికి బిసి ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు టి. చిరంజీవులు, జస్టిస్ ఈశ్వరయ్య, బిసి పొలిటికల్ ప్రింట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ పలు హాజరై దిశానిర్దేశమిచ్చారు. వీరి ఆధ్వర్యంలోనే 42 శాతం బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పడింది. బిసి రిజర్వేషన్లను పార్లమెంట్‌లో చట్టం చేసి, 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేసింది.

భావజాల వ్యాప్తికి రాజ్యాంగబద్ధంగా పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా అక్టోబర్ 24న జరిగింది. ఈ ధర్నా బిసి ఉద్యమానికి ఆరంభ సంకేతంగా నిలిచింది. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి వేదికగానే చారిత్రకమైన బిసి డిక్లరేషన్ ప్రకటించింది. అదే వేదికగా నవంబర్ 15న బిసిల ఆక్రోషసభ జరిగింది. ఈ కార్యక్రమాలలో బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు ఉమ్మడిగా కలిసిరావడంతో ఆ వర్గాల్లో రాజకీయ చైతన్యం ప్రారంభమైనవి. ఈ సమితి ఆధ్వర్యంలో భాగమైన డాక్టర్ విశారదన్ మహరాజ్ జాక్ వేదికగా లక్ష కిలోమీటర్ల రథయాత్ర అట్టడుగు వర్గాల రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతూనే.. రాజ్యాధికారం కోసం ధర్మయుద్ధం సాగింది. ప్రజా సమస్యలపై సింహగర్జన చేశాడు. గతంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ దళితశక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో పది వేల కిలోమీటర్లు బిసి, ఎస్‌సి, ఎస్‌టిల స్వరాజ్య పాదయాత్ర చేశారు. ఆయా కులాల వాటానడుగుతూ రాజ్యాధికార స్పృహ రగిలించాడు. నేటి బిసిల రాజకీయ స్పృహకు కారణం కూడా ఇదే. ఒకవైపు జాక్ రథయాత్ర, మరొకవైపు బిసి రిజర్వేషన్ల సాధన సమితి పోరాటం నేటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనుల విజయానికి కారణమైనది. ఈ వాస్తవాన్ని బిసి, ఎస్‌సి, ఎస్‌టి నాయకులు అర్థం చేసుకొని భవిష్యత్తు రాజ్యాధికార పోరాటాలకు కలిసి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే పీడిత వర్గాలకు విముక్తి లభిస్తుంది.

సంపతి రమేష్ మహారాజ్

79895 79428