
మావోయిస్టు పార్టీకి ఎవొబిలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో 22 మంది నక్సల్స్ లొంగిపోయారు. ఒడిశా మల్కాన్‌గిరి జిల్లాలో ఆ రాష్ట్ర డిజిపి ఎదుట ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మావోయిస్టుల వద్ద ఉన్న 14 ల్యాండ్‌మైన్లను పోలీసులకు అప్పగించారు. వీరందరిపై కలిపి రూ.2.18 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మార్చి 2026 నాటి దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తానని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయుధ బలగాలు ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో నక్సల్స్‌పై విరుచుకుపడుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణిస్తున్నారు. అదే స్థాయిలో పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.