Reading Time: < 1 minute
Pm Modi Mumbai Security Alert Fake Pmo Id Gun Found 2 Suspects Detained

PM Modi: ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ నుంచి ఇద్దరు అనుమానితుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్‌లో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026ను ప్రారంభించే కార్యక్రమానికి ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మోడీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఇద్దరు అనుమానితులు పట్టుబడటం షాకింగ్‌కు గురిచేస్తోంది.

అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితుల్లో ఒకరు తాను ప్రధాని కార్యాలయం (PMO) అధికారిగా పరిచయం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పీఎంకు చెందిన నకిలీ ఐడీ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. భద్రతా తనిఖీల్లో ఆ గుర్తింపు కార్డు నకిలీదని తేలింది. రెండో అనుమానితు వద్ద నుంచి తుపాకీ గుర్తించిన్నట్లు సమాచారం.

నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో జరుగుతున్న ప్రధాని మోడీ కార్యక్రమ వేదిక వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని, అతడి బాడీగార్డుగా నటిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తేలింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి 24 ఏళ్ల రోహన్ పరేఖ్ పేరుతో నకిలీ ఐడీ కార్డు కలిగి ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. తుపాకీ, నకిలీ ఐడీ కార్డు కలిగి వేదికలోకి ప్రవేశించడం వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకునేందుకు ముంబై పోలీసులు ప్రస్తుతం ఇద్దరు నిందితుల్ని విచారిస్తున్నారు.