
Kinetic DX Plus 3.1kWh: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కైనెటిక్ (Kinetic) తన DX సిరీస్ లో భాగంగా కొత్త Kinetic DX Plus 3.1kWh వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో తరచుగా ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండేలా ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించారు. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ స్కూటర్ IDC సైకిల్‌పై గరిష్టంగా 132 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ప్రస్తుతం కైనెటిక్ DX సిరీస్ ధరలు రూ.1.18 లక్షల ఎక్స్ షోరూమ్ నుంచి ప్రారంభమవుతుండగా.. కొత్త DX Plus 3.1kWh వేరియంట్ ఈ లైనప్‌లో టాప్ మోడల్‌గా నిలుస్తుంది.
కొత్త కైనెటిక్ DX ప్లస్ 3.1kWh వేరియంట్‌లో పేరుకు తగ్గట్టుగానే 3.1kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న DX ప్లస్ 2.6kWh వేరియంట్‌తో పోలిస్తే ఇది 27 కి.మీ. అదనపు క్లెయిమ్డ్ రేంజ్‌ను అందిస్తుంది. DX Plus 2.6kWh మోడల్ IDC సైకిల్‌పై 105 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుండగా, కొత్త 3.1kWh వెర్షన్ 132 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీలో LFP కెమిస్ట్రీని ఉపయోగించారు. సాధారణంగా LFP బ్యాటరీలు మెరుగైన థర్మల్ స్టెబిలిటీ, దీర్ఘకాలిక మన్నికకు పేరుగాంచాయి.
అయితే కంపెనీ ప్రకటించిన 132 కిలోమీటర్ల రేంజ్ IDC సర్టిఫైడ్ ఫిగర్ మాత్రమే. వాస్తవ వినియోగంలో లభించే రేంజ్ రైడింగ్ స్పీడ్, ట్రాఫిక్ పరిస్థితులు, స్కూటర్‌పై ఉన్న లోడ్, రోడ్డు పరిస్థితులు, టైర్ ప్రెజర్, వాతావరణ ఉష్ణోగ్రత, ఎంచుకున్న రైడింగ్ మోడ్ వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. ఈ కొత్త DX Plus 3.1kWhలో రేంజ్ పెరగడానికి పెద్ద బ్యాటరీతో పాటు మోటార్ సెటప్‌లోనూ మార్పులు చేశారు. ఈ వేరియంట్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 3.8kW పవర్ ఉత్పత్తి చేస్తుంది. అదే DX Plus 2.6kWh వేరియంట్‌లో 4.78kW పీక్ పవర్ మోటార్ ఉంటుంది.
కొత్త 3.1kWh మోడల్‌లో రేంజ్, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు మాత్రమే ఉన్నాయి. చిన్న బ్యాటరీతో వచ్చే DX ప్లస్ తో పాటు బేస్ DX మోడల్‌లో లభించే టర్బో మోడ్ కొత్త వేరియంట్‌లో అందుబాటులో లేదు. దీంతో ఈ కొత్త మోడల్‌ను ప్రధానంగా ఎక్కువ రేంజ్‌ను కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. వేగవంతమైన యాక్సిలరేషన్, అదనపు టర్బో మోడ్ కావాలనుకునే వారికి 2.6kWh వేరియంట్ అనుకూలంగా ఉండవచ్చు.
ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో స్టాండర్డ్ DX Plus వేరియంట్‌లో ఉన్న చాలా ఫీచర్లు కొనసాగాయి. ఇందులో మెటల్ బాడీ, LED లైట్లు, 8.8 అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్, 37 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇవే కాకుండా కీలెస్ గో, పాస్‌వర్డ్ ఆధారిత ఇగ్నిషన్, Easy Flip ఫుట్‌రెస్ట్స్, క్రూయిజ్ కంట్రోల్, టెలిమాటిక్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, పార్క్ అసిస్ట్, రివర్స్ మోడ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనిని రెడ్, బ్లూ, బ్లాక్, గ్రే, వైట్ అనే ఐదు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఇవే కలర్ ఆప్షన్స్ ప్రస్తుతం ఉన్న DX Plus వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.