
వివాహ బంధంలో భార్య సమ్మతి లేకుండా భర్త లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని అత్యాచారంగా పరిగణించాలా? భర్తలకు కల్పిస్తున్న మారిటల్ రేప్ మినహాయింపు (Marital Rape Exception) రాజ్యాంగబద్ధమేనా? అనే అంశాలపై సుప్రీంకోర్టు మూడు వారాల్లో విచారణ ప్రారంభించనుంది.
భార్యపై అత్యాచారం చేసినప్పటికీ భర్తపై రేప్ కేసు నమోదు కాకుండా రక్షణ కల్పిస్తున్న నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులో ప్రధానంగా రెండు అంశాలను పరిశీలించనున్నట్లు తెలిపింది. మారిటల్ రేప్ మినహాయింపు చట్టంలో కొనసాగుతున్నప్పటికీ.. అలాంటి చర్యకు సంబంధించి ప్రాసిక్యూషన్ కొనసాగించవచ్చా? అలాగే భర్తలకు రేప్ కేసు నుంచి రక్షణ కల్పిస్తున్న ఈ మినహాయింపు రాజ్యాంగబద్ధమేనా? అనే అంశాలను కోర్టు పరిశీలించనుంది.
ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (AIDWA) సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లలో.. 2024లో భారతీయ శిక్షాస్మృతికి (IPC) బదులుగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS)లో మారిటల్ రేప్ మినహాయింపును కొనసాగించడాన్ని సవాలు చేశారు. BNS ప్రకారం.. 18 ఏళ్లకు పైబడిన భార్యతో భర్త లైంగిక సంబంధం లేదా లైంగిక చర్యకు పాల్పడితే.. అది అత్యాచారం కిందికి రాదని మినహాయింపు కల్పించారు.
మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలనే డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. బుధవారం విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. చట్టంలో మారిటల్ రేప్ మినహాయింపు కొనసాగుతున్నంతకాలం.. అలాంటి చర్యను అత్యాచార నేరంగా పరిగణించలేమని ఆయన తెలిపారు. మారిటల్ రేప్‌ను నేరంగా ప్రకటించాలా వద్దా అనే నిర్ణయం పార్లమెంట్ తీసుకోవాల్సిందే తప్ప.. న్యాయస్థానం జోక్యం చేసుకుని చట్టాన్ని మార్చకూడదని కేంద్రం వాదించింది. “మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాల్సి వచ్చినా.. ఆ నిర్ణయం తీసుకోవడం సుప్రీంకోర్టు పని కాదు. అది శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల పరిధిలోని అంశం” అని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
ధర్మాసనంలో ఉన్న జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. “మహిళల భద్రత, రక్షణ ముఖ్యమైన అంశం. అయితే వివాహ బంధంలో సమ్మతి లేని లైంగిక సంబంధాన్ని రాష్ట్రం ‘అత్యాచారం’గా నిర్వచిస్తుందా లేదా?” అని ఆయన ప్రశ్నించారు. తీవ్రమైన గాయాలు, హాని లేదా మరణం సంభవించిన సందర్భాల్లో ఇప్పటికే ఉన్న ఇతర క్రిమినల్ చట్టాల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. ప్రస్తుత మారిటల్ రేప్ మినహాయింపు భర్తను అలాంటి ఇతర నేరాల నుంచి రక్షించదని కూడా ఆయన స్పష్టం చేశారు.
పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్ న్యాయవాది కరుణా నంది వాదనలు వినిపించారు. లైంగిక హింసకు పాల్పడి భార్యకు తీవ్ర గాయాలు చేసిన భర్త.. కేవలం వివాహ బంధం కారణంగా క్రిమినల్ బాధ్యత నుంచి మినహాయింపు పొందకూడదని ఆమె వాదించారు. ఈ సందర్భంగా జస్టిస్ బాగ్చి.. మారిటల్ రేప్ అంశంపై రాజ్యాంగ, క్రిమినల్ చట్టాలకు సంబంధించిన విస్తృత ప్రశ్నలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని సూచించారు.
విచారణ సందర్భంగా మెన్స్ రియా (నేర ఉద్దేశం), నేర బాధ్యత (culpability) వంటి అంశాలతో పాటు.. రాజ్యాంగ హామీలను ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. “మెన్స్ రియా, నేర బాధ్యత, అలాగే రాజ్యాంగాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాలను పరిశీలించాలి. తద్వారా మన పౌరులకు అకస్మాత్తుగా ఆశ్చర్యం కలిగించకుండా ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
పాశ్చాత్య దేశాలను భారత్ గుడ్డిగా అనుసరించదు
మారిటల్ రేప్‌ను క్రిమినల్ నేరంగా ప్రకటించడాన్ని కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. గతంలో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో.. మారిటల్ రేప్‌ను నేరంగా ప్రకటిస్తే విస్తృత సామాజిక పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని, ఇది వివాహ వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని కేంద్రం పేర్కొంది. భారత్ “పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుసరించకూడదు” అని కూడా కేంద్రం తన వాదనలో పేర్కొంది. ఈ అంశంలో భారతదేశానికి ప్రత్యేకమైన సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. మారిటల్ రేప్‌ను నేరంగా ప్రకటించడంలో ఏదైనా మార్పు అవసరమైతే.. అది న్యాయస్థాన జోక్యంతో కాకుండా పార్లమెంట్ ద్వారానే జరగాలని కేంద్రం స్పష్టం చేసింది.
మారిటల్ రేప్ మినహాయింపు రాజ్యాంగబద్ధతపై 2022లో ఢిల్లీ హైకోర్టులో విభజిత తీర్పు వెలువడింది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై ఇప్పుడు సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. మూడు వారాల తర్వాత ప్రారంభం కానున్న విచారణలో.. వివాహ బంధంలో సమ్మతి లేని లైంగిక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించాలా? భర్తలకు కల్పిస్తున్న మారిటల్ రేప్ మినహాయింపు రాజ్యాంగబద్ధమేనా? వంటి కీలక అంశాలపై సుప్రీంకోర్టు పరిశీలన జరపనుంది.