Reading Time: < 1 minute
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీల్లో భారీగా టీచర్ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌

నంద్యాల జిల్లాలోని మహిళా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తూ స్త్రీ, శిశు అభివృద్ధి, సాధికారత కార్యాలయం (WDCW) నోటిఫికేషన్ విడుదల చేసింది. WDCW పరిధిలోని 6 ఐసిడియస్ (ICDS) ప్రాజెక్ట్‌లలో ఒప్పంద ప్రాతిపదికన అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 70 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల్లో 3 మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు, 67 అంగన్‌వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 18, 2026వ తేదీ వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు సంబంధిత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 21 ఏళ్ల అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, కనీసం 18 ఏళ్లు నిండిన అభ్యర్థులను కూడా పరిశీలించే అవకాశం ఉంది. అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితులై ఉండాలి. అంతేకాకుండా సంబంధిత ప్రాంతానికి స్థానిక నివాసి అయి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 18, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల మెరిట్, అర్హతలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎంపిక ప్రక్రియలో సంబంధిత నిబంధనలను అనుసరించనున్నారు.

దరఖాస్తుతో జత చేయాల్సిన పత్రాలు

అభ్యర్థులు దరఖాస్తుతో పాటు అభ్యర్ధులు ఈ కింది ధ్రువపత్రాలను జత చేయాల్సి ఉంటుంది. అవేంటంటే..

  • వయసు/పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం
  • 10వ తరగతి మార్కుల జాబితా, టీసీ తదితర విద్యార్హత ధ్రువపత్రాలు
  • స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • వితంతువులు, దివ్యాంగులు అయితే సంబంధిత ధ్రువపత్రాలు

నంద్యాల జిల్లా అంగన్‌వాడీల్లో ఉద్యోగాలకు ఆఫ్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.