
కరీంనగర్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడుల్లో హుజురాబాద్ సబ్‌జైల్ డిప్యూటీ జైలర్, ఓ పెట్రోల్ బంక్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. రిమాండ్ ఖైదీకి సౌకర్యాలు కల్పించేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
హుజురాబాద్ సబ్‌జైల్ డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్‌తో పాటు.. ఆయన తరఫున లంచం తీసుకున్న పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
రిమాండ్ ఖైదీకి జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో పాటు ములాఖత్‌లకు అవకాశం కల్పిస్తామని, అలాగే ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూస్తామని చెప్పి డిప్యూటీ జైలర్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.డిప్యూటీ జైలర్ తరఫున హరీష్ రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
లంచం నగదును స్వీకరించిన హరీష్ చేతి వేళ్లకు ఏసీబీ అధికారులు నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అనంతరం డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీష్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. లంచం డిమాండ్ వెనుక ఉన్న పరిస్థితులు, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.