
- ఏ అకౌంట్ నుంచి చెల్లిస్తే ఆ అకౌంట్‌కే చెల్లిస్తం
- హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ స్కీమ్‌లో దరఖాస్తుదారులు చెల్లించిన డిపాజిట్ తిరిగి చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఫ్లాట్ కోసం రూ.10 వేలు చెల్లించి డ్రాలో ఫ్లాట్ రాని అప్లికెంట్లకు హౌసింగ్ బోర్డు డబ్బులు తిరిగి చెల్లించనుంది. దరఖాస్తు సమయంలో డిపాజిట్(ఈఎండీ)గా రూ.10వేలు చెల్లించారు.
మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఈఎండీ మొత్తాన్ని ఆన్ లైన్ లోనే తీసుకున్నారు. ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో, లాటరీలో ఎంపిక కాని దరఖాస్తుదారులకు ఈఎండీ డబ్బులు తిరిగి చెల్లిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు.
దరఖాస్తుదారులు తాము ఏ అకౌంట్ నుంచి డబ్బులు చెల్లించారో అదే అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లో ఈ చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. మీ సేవా కేంద్రాల్లో నగదు, ఇతరుల అకౌంట్ నుంచి చెల్లించిన వారికి డబ్బులు చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్ సైట్ tghb.telangana.gov.in ద్వారా ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కొనసాగుతున్న వెరిఫికేషన్..
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లో లాటరీ ద్వారా ఎంపికైన వారి వివరాల పరిశీలన కొనసాగుతోందని గౌతం వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత అర్హులైన వారికి అలాట్మెంట్ లెటర్ అందచేస్తామని తెలిపారు. వివరాలను క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తున్నామని తెలిపారు. వెరిఫికేషన్ తరువాత లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎలా చెల్లించాలనే విషయంపై స్పష్టత ఇస్తామని చెప్పారు. వెరిఫికేషన్ ప్రక్రియకు ఎంపికైన వారు సహకరించాలని కోరారు.
ఆ నాలుగు నియోజకవర్గాల్లో దరఖాస్తుకు రేపే ఆఖరు..
చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల పరిధిలో నిర్మించనున్న టవర్స్ లోని ఇండ్ల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తులను ఈ నెల 10 వరకు అందజేయవచ్చని వైస్ చైర్మన్ గౌతం తెలిపారు.