Reading Time: 2 minutes

అంతా నా భర్తకే తెలుసు.. వీసా స్కామ్‌‌పై పోలీసుల విచారణలో యూట్యూబర్ నందు!

Caption of Image.

యూట్యూబర్ నందు అలియాస్ నందన (  నందూస్ వరల్డ్ ) దంపతుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు, వీసా స్పాన్సర్ షిప్ ల పేరిట కోట్ల రూపాయాల మోసానికి పాల్పడ్డారని నందన, ఆమె భర్త మధుకరపై  ఆరోపణలు ఉన్నారు. ఇప్పటికే వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు కూడా చేశారు.  గతేడాది నవంబర్ లో ఇదే వ్యవహారంలో శివక్రాంతి కుమార్ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పీఎస్ లో ఈ జంటపై కేసు నమోదైంది.

ఎయిర్ పోర్టులో అరెస్ట్..

దీంతోఈ దంపతుల వీసా స్కామ్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  ఆరోపణలతో పాటు బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో వీరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నిన్న ( సెప్టెంబర్ 7, 2026 ) బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒంటరిగా నందన లండన్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చారు. నందన దంపతులపై గతంలోనే లుక్ అవుట్ సర్క్యులర్  జారీ కావడంతో అధికారులు వెంటనే అలెర్ట్ అయ్యారు.  

ఇబ్రహీంపట్నం పీఎస్‌లో విచారణ..

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  నిన్న రాత్రి ఎయిర్‌పోర్ట్‌లో డిటైన్ చేసిన పోలీసులు.. ఈరోజు ఆమెకు 41A నోటీసులు జారీ చేసి ఇబ్రహీంపట్నం పీఎస్‌లో  పోలీసులకు అప్పగించారు. అక్కడ పోలీసులు ఆమెను సుదీర్ఘ విచారించారు. అయితే నందన తన లాయర్, కుటుంబ సభ్యులతో కలిసి సొంత వాహనంలో పిఎస్ ముందర ప్రత్యక్షమడం చూసి మీడియా అవాక్కైంది. 

ఏంటి ఈ వీసా స్కామ్?

‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరిట షెల్ కంపెనీలను నడుపుతూ, లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు నందన దంపతులపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. నకిలీ ‘సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS)’ లెటర్లు విక్రయించి కోట్లకు పడగలెత్తారనేది బాధితుల వాదన. గతంలో శివక్రాంతి అనే బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు. 

అంతా నా భర్తకే తెలుసు..

అయితే పోలీసుల విచారణలో ఈ వీసా స్కామ్ పై తనకు ఏమీ తెలియదని.. ఈ వ్యవహారమంతా తన భర్త మధుకర్ చూసుకుంటారని నందన చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు నందన నుంచి దాటవేత సమాధానాలు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో పలు కీలక ప్రశ్నలకు సమాధానాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని నందనకు నోటీసులు ఇచ్చినట్లు  ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈకేసులో నందన భర్త మధుకర్‌ను కూడా విచారణకు పిలుస్తామని చెప్పారు..

ఈ దంపతుల షెల్‌ కంపెనీల ఏర్పాటు, నకిలీ వీసా/CoS లేఖలు, విదేశీ ఉద్యోగాల పేరుతో వసూళ్లు.. ఈ ఆరోపణల వెనుక అసలు కథేంటి? ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత మొత్తం చేతులు మారింది? అన్నదానిపై పోలీసులు దృష్టి సారించారు.  నందన దంపతులను ప్రశ్నించడం ద్వారా ఈ అంతర్జాతీయ వీసా రాకెట్‌ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు? అన్న సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది…

 
 

©️ VIL Media Pvt Ltd.