
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. పోలెండ్ స్టార్ ప్లేయర్, ఎనిమిదోసీడ్ ఇగా స్వైటెక్.. ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. సోమవారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌లో స్వైటెక్ 5–7, 3–6తో క్విన్‌వెన్ జెంగ్ (చైనా) చేతిలో ఓడింది. గంటా 56 నిమిషాల మ్యాచ్‌లో స్వైటెక్ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. మ్యాచ్ మొత్తంలో ఏడు బ్రేక్ పాయింట్లలో నాల్గింటిని మాత్రమే కాచుకుంది. ఒక ఏస్, రెండు డబుల్ ఫాల్ట్స్, 28 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మూల్యం చెల్లించుకుంది. 17 విన్నర్లతో సరిపెట్టుకుంది. మూడు ఏస్‌లు, రెండు డబుల్ ఫాల్ట్స్ చేసిన జెంగ్ తన సర్వీస్‌లో 84 శాతం పాయింట్లు రాబట్టింది.
13 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని కాచుకుంది. 20 విన్నర్లు, 17 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో ఐదోసీడ్ ఆండ్రీవా (రష్యా) 5–7, 6–4, 6–3తో అనస్టాసియా పొటపోవా (ఆస్ట్రియా)పై, మూడోసీడ్ జెస్సికా పెగులా (అమెరికా) 6-3, 6–-4తో సోరెనా క్రిస్టీ (రొమేనియా)పై, ఆరోసీడ్ లిండా నోస్కోవా (చెక్) 7-–5, 5–-7, 6–-4తో మార్టా కోస్టుక్ (ఉక్రెయిన్)పై, ఎమ్మా నవారో (అమెరికా) 6-–4, 6–-2తో కలిన్‌స్కయా (రష్యా)పై, టాప్‌సీడ్ అరీనా సబలెంక (బెలారస్) 6-–4, 6–-3తో టేలర్ టౌన్‌సెండ్ (అమెరికా)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.
మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ కార్లోస్ అల్కరాజ్ 6–4, 6–3, 6–4తో టామీ పాల్ (అమెరికా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫలితంగా తన గ్రాండ్‌స్లామ్ విజయాల పరంపరను 18కి పొడిగించుకున్నాడు. కుడి మణికట్టు గాయంతో నాలుగు నెలల విరామం తీసుకున్న అల్కరాజ్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. నాలుగు రౌండ్లలో కేవలం ఒక్క సెట్ మాత్రమే కోల్పోయి తన మునుపటి ఫామ్‌ను చూపెట్టాడు.
2 గంటలా 21 నిమిషాల మ్యాచ్‌లో మూడో సెట్‌లో మాత్రమే పాల్ ఆటను కాస్త ఉత్కంఠకు తెచ్చాడు. అయితే అల్కరాజ్ కొట్టిన కచ్చితమైన షాట్ బౌండరీ లైన్ లోపల పడటంతో మ్యాచ్ పాయింట్ సొంతమైంది. ఇతర మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) 6–2, 6–3, 6–4తో సిట్సిపాస్ (గ్రీస్)పై గెలవగా, ఏడో సీడ్ డానియెల్ మెద్వెదెవ్ (రష్యా)కు ఊహించని షాక్ తగిలింది. 11వ సీడ్ ఫ్రాన్సెస్ తియాఫో (అమెరికా) 7–6 (7/1), 6–4, 7–6 (7/8)తో మెద్వెదెవ్‌పై గెలిచాడు.