
- టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ వాణి ప్రసాద్, ఎండీ గౌతమితో భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం అంతర్జాతీయ కేంద్రంగా మరింత విస్తరిస్తోంది. ఇక్కడ బౌద్ధ సంస్కృతి, చరిత్ర, తత్వశాస్త్ర అధ్యయనం, పరిశోధనల కోసం ప్రత్యేకంగా ‘శ్రీలంక బౌద్ధ కేంద్రం’ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శ్రీలంకకు చెందిన ప్రముఖ బౌద్ధ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
శ్రీలంక సహాన్య ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ బౌద్ధ భిక్షువు అగ్రహీర్ కస్సప ధీరో, ప్రతినిధులు కౌసల్య, వైభవ్‌ల బృందం బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో మంగళవారం సచివాలయంలో పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, టీజీటీడీసీ ఎండీ గౌతమిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ వాణి ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణలో చారిత్రక బౌద్ధ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయని, వాటన్నింటినీ బుద్ధవనం కేంద్రంగా కలుపుతూ సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భారత్–శ్రీలంక దేశాల మధ్య బౌద్ధ సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. బుద్ధవనంలో శ్రీలంక బౌద్ధ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం, టీజీటీడీసీ తరఫున అన్నివిధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
భూటాన్ పర్యాటకుల రాకపై చర్చ
అనంతరం భూటాన్‌కు చెందిన ట్రావెల్, టూరిజం ప్రతినిధి, మాజీ ఎంపీ రంజన్ జమిస్తో, సోల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సీఈవో లాంగ్రా డోర్జీలు కూడా పర్యాటకశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. భూటాన్–భారత్ పర్యాటక బంధాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు భూటాన్ నుంచి బౌద్ధ పర్యాటకులను తెలంగాణలోని బుద్ధవనం సందర్శనకు రప్పించేలా బౌద్ధ పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయడంపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో బుద్ధవనం ఇన్‌చార్జి మేనేజర్ శ్యాంసుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.