Reading Time: < 1 minute

స్వచ్ఛవాయు సర్వేక్షణ్‌లో తెలంగాణకు అవార్డుల పంట 

Caption of Image.
  • దేశంలో రెండో స్థానంలో నిలిచిన నల్గొండలోని 16వ వార్డు
  • రాష్ట్రస్థాయి కేటగిరీలో జూబ్లీహిల్స్, గన్‌ఫౌండ్రీ, సంగారెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణకు జాతీయ అవార్డులు వరించాయి. గాలి నాణ్యతను పెంచడం, కాలుష్య నివారణ చర్యల్లో రాష్ట్రంలోని పలు పట్టణాలు, మున్సిపల్ వార్డులు ఉత్తమ ప్రతిభతో మెరిశాయి. సోమవారం ‘అంతర్జాతీయ స్వచ్ఛవాయు దినోత్సవం–2026’ సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రదానం చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) చైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, కేంద్ర పర్యావరణశాఖ సెక్రటరీ తన్మయ్ కుమార్ ఈ అవార్డులను అందజేశారు.

5వ ‘స్వచ్ఛవాయు సర్వేక్షణ్’ పురస్కారాల్లో తెలంగాణలోని నల్గొండ జాతీయ స్థాయిలో మెరిసింది. వార్డు కేటగిరీలో (10 వేలలోపు జనాభా కలిగిన వార్డులు) నల్గొండ పట్టణంలోని 16వ వార్డు దేశంలోనే రెండో ర్యాంకు సాధించింది. అలాగే, కేటగిరీ-3 నగరాల విభాగంలో (3 లక్షల జనాభాలోపు) తెలంగాణకు చెందిన రెండు పట్టణాలు టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. సంగారెడ్డి 186.8 స్కోరుతో దేశంలోనే 8వ ర్యాంకు సాధించగా, నల్గొండ 185.8 స్కోరుతో 10వ ర్యాంకు దక్కించుకుంది.

రాష్ట్రస్థాయిలో కేటగిరీ-1 (30 వేలలోపు జనాభా) విభాగంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, కేటగిరీ-2 (10 వేల 30 వేల జనాభా) విభాగంలో హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ, కేటగిరీ-3 (10 వేలలోపు జనాభా) విభాగంలో సంగారెడ్డిలోని 31వ వార్డు సత్తా చాటాయి. కేటగిరీ-1 నగరాల విభాగంలో (10 లక్షలలోపు జనాభా) హైదరాబాద్ నగరం 174.2 స్కోరుతో జాతీయ స్థాయిలో 19వ ర్యాంకు సాధించింది. కాగా, దేశవ్యాప్తంగా వార్డుల కేటగిరీలో లక్నో (జోన్ 4–వార్డు 70) తొలి స్థానం, ఇండోర్ (బీఎంసీ 60) రెండో స్థానం, మహారాష్ట్రలోని నాసిక్ (ఎన్‌ఎంసీ వార్డు –7) మూడో స్థానంలో నిలిచాయి. 
 

©️ VIL Media Pvt Ltd.