
అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన EB-1 కేటగిరీ కింద భారత పౌరులకు కేటాయించిన వీసాలు సెప్టెంబర్ 30 లోపు పూర్తిగా అయిపోయే ప్రమాదముందని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. విపరీతమైన డిమాండ్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే ఈ వీసాలు నిలిచిపోయే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
EB-1 అంటే ఎంప్లాయ్‌మెంట్-బేస్డ్ ఫస్ట్-ప్రిఫరెన్స్ కేటగిరీ. దీనికింద అసాధారణ ప్రతిభ కలిగిన నిపుణులు, అత్యుత్తమ ప్రొఫెసర్లు, రీసెర్చర్స్, గ్లోబల్ కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు ఈ కేటగిరీ కిందకు వస్తారు. సెప్టెంబర్ వీసా బులెటిన్ ప్రకారం.. భారతీయ దరఖాస్తుదారుల నుంచి వస్తున్న అనూహ్య డిమాండ్ ఇలాగే కొనసాగితే.. ఇండియాకి అలాట్ చేసిన వార్షిక కోటా త్వరలోనే ముగిసిపోతుంది. ఒకసారి ఈ కోటా పూర్తయితే.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై వీసా కేటాయింపులు రీసెట్ అయ్యే వరకు ఈ కేటగిరీలో ఎలాంటి వీసాలు జారీ చేయరు.
ప్రస్తుత సెప్టెంబర్ నెలలో భారతీయ దరఖాస్తుదారులకు ఈబీ-1 ఫైనల్ యాక్షన్ డేట్ అక్టోబర్ 15, 2022 వద్దే నిలిచిపోయింది. అంటే దాదాపు 4 ఏళ్ల నాటి దరఖాస్తులకే ఇంకా మోక్షం లభించడం లేదు. ఇక ఫైలింగ్ తేదీల చార్ట్ ప్రకారం డిసెంబర్ 1, 2023గా ఉంది. సెప్టెంబర్ 30 లోపు ఈబీ-1 కేటగిరీ పూర్తిగా లభ్యం కాకుండా పోతే, ప్రాసెస్ లో ఉన్న అర్హులైన అభ్యర్థుల అప్రూవల్స్ నిలిచిపోయి తీవ్ర నిరాశ ఎదురవుతుంది.
ALSO READ : క్రెడిట్ కార్డ్ అంటేనే వణికిపోతున్న ఉద్యోగులు..
ఇతర కేటగిరీల్లోనూ అంతులేని వెయిటింగ్
కేవలం ఈబీ-1 మాత్రమే కాకుండా, ఇతర ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ విభాగాల్లోనూ భారతీయుల పరిస్థితి దయనీయంగా ఉంది. అత్యంత కీలమైన ఈబీ-2 కేటగిరీ సెప్టెంబర్‌లో పూర్తిగా అందుబాటులో లేదని తేలింది. అలాగే ఈబీ-3 కేటగిరీలో జనవరి 1, 2014 నాటి దరఖాస్తులకే ఇంకా ప్రాధాన్యం ఇస్తుండటంతో.. ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది దశాబ్ద కాలంగా తమ వంతు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
దేశాలవారీ కోటా..
అమెరికా చట్టాల ప్రకారం ప్రతి ఏటా జారీ చేసే వర్క్ వీసాలపై, అలాగే ఒక్కో దేశానికి వర్తించే 7 శాతం సీలింగ్ పరిమితిపై కఠిన నిబంధనలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రపంచవ్యాప్త పరిమితి లక్షా 86వేల317 కాగా.. దేశాలవారీ పరిమితి 28వేల 862 మాత్రమే. ఈ తక్కువ కోటాకి తోడు భారత్ నుంచి విపరీతమైన అప్లికేషన్స్ వస్తుండటంతో గ్రీన్ కార్డ్ క్యూ లైన్ నానాటికీ పెరిగిపోతూనే ఉంది.