Reading Time: < 1 minute
Sardar 2 Sj Suryah Global Warming Message Karthi Movie

Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీ, ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్‌, ఆశికా రంగనాథ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఎస్.జే. సూర్య.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సర్దార్ 2’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. గతంలో వచ్చిన ‘సర్దార్’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని, రెండో భాగం అంతకుమించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందని తెలిపారు. మిత్రన్‌ ఆలోచనా విధానం, కథను తెరకెక్కించిన తీరు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఎస్.జే. సూర్య పేర్కొన్నారు. యాక్షన్‌, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు సినిమాలో ఒక బలమైన సందేశం కూడా ఉంటుందని చెప్పారు.

ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను కథలో ప్రస్తావించినట్లు తెలిపారు. లియోనార్డో డికాప్రియో వంటి వారు చాలాకాలంగా పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తుచేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ‘సర్దార్ 2’ ద్వారా మిత్రన్‌ చెప్పే ప్రయత్నం చేశారని అన్నారు. “సినిమాను కేవలం చూసి థియేటర్‌లో వదిలేసి వెళ్లకండి. అందులోని మంచి సందేశాన్ని ఇంటికి తీసుకెళ్లాలి. మన జీవితంలో ఆలోచించాలి” అంటూ ప్రేక్షకులకు ఎస్.జే.సూర్య సూచించారు. అలాగే కార్తీ ఎంపిక చేసుకునే కథలు ఎప్పుడూ విభిన్నంగా ఉంటాయని ప్రశంసించారు. ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలో కార్తీ రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తూ అద్భుతంగా నటించారని చెప్పారు. ఆశికా రంగనాథ్‌, మాళవిక మోహనన్‌ కూడా తమ పాత్రల్లో మెప్పించారని తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ నాగార్జున, కార్తీ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. కార్తీ సైకిల్‌పై షూటింగ్‌ చేస్తున్న సమయంలో ఇబ్బంది కలగకుండా నాగార్జున ప్రత్యేకంగా స్పీడ్ బ్రేకర్‌ను తొలగించారని చెప్పిన సంఘటనను పంచుకున్నారు. చివరగా సెప్టెంబర్ 10న ‘సర్దార్ 2’ను థియేటర్లలో తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరారు.