
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించే ధైర్యం లేకనే అక్రమ అరెస్ట్‌లు చేయిస్తున్నదని బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూనే బయటే అరెస్ట్‌లు చేయడం అప్రజాస్వామికమన్నారు. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన వ్యవహారంపై సోమవారం ఆయన స్పందించారు.
మహిళా సభ్యులపై వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గమని విమర్శించారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి సభ్యులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకే నల్ల టీ షర్ట్‌లతో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వచ్చారని తెలిపారు. కానీ, అసెంబ్లీ లోపలికి వెళ్లక ముందే అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్ వేసుకెళ్లొచ్చుగానీ.. తమ సభ్యులు మాత్రం వేసుకోవద్దా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన తాము ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు