
- స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై ఆందోళనలు
- చావు డప్పు మోగించేందుకు జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు
- రోడ్లను దిగ్బంధించిన పోలీసులు.. అడ్డదారుల్లో కార్యకర్తలు
- అడ్డుకునేందుకు ఫాంహౌస్ వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు
- ఇరు పార్టీల బాహాబాహీ.. ఆరు గంటల పాటు ఉద్రిక్తత
- దామరకుంట, వరదరాజుపల్లి వద్ద కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
- తోపులాటలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి గాయాలు
- రాళ్లు రువ్వడంతో పలు వాహనాల ధ్వంసం
సిద్దిపేట/ములుగు, వెలుగు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ వద్ద చేపట్టిన చావు డప్పు కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ వద్ద మంగళవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు మోహరించడంతో దాదాపు ఆరు గంటలకు పైగా టెన్షన్ నెలకొన్నది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫాంహౌస్ ప్రాంతమంతా యుద్దవాతావరణం కనిపించింది. ఎర్రవల్లి ఫాంహౌస్ ముందు వెయ్యి డప్పులతో నిరసన తెలపాలన్న పిలుపుతో వివిధ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరాయి. వారిని అడ్డుకునేందుకు ఉదయం నుంచే ఫాంహౌస్ వద్దకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ మోహరించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఫాంహౌస్‌కు చేరుకునే నాలుగు ప్రధాన మార్గాల ద్వారా చొచ్చుకుని వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు.
దీంతో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాన మార్గాల మీదుగా కాకుండా అడ్డదారుల్లో ఫాంహౌస్ దగ్గరకు రాగా వారినీ పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు పొలాల నుంచి ఫాంహౌస్‌కు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలతో తలపడడానికి ప్రయత్నించారు. కర్కపట్ల మీదుగా వస్తున్న ఇతర జిల్లాల కాంగ్రెస్ నేతలను దామరకుంట వద్ద బీఆర్ఎస్ శ్రేణులు, వరదరాజుపల్లి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.
మర్కుక్ మండలం దామరకుంట వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఇతర జిల్లాల నుంచి కర్కపట్ల మీదుగా ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌కు ప్రత్యేక వాహనాల్లో వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను దామరకుంట దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపైకి రాళ్లు రువ్వడంతో కొందరు గాయపడగా పదికి పైగా కార్ల అద్దాలు పగిలాయి. ఒక ఇంట్లో నుంచి రాళ్లు విసురుతున్న బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ నేతలు బయటకులాగి కొట్టారు. ఇరువర్గాల మధ్య ఘర్షణతో కొద్దిసేపు ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ గొడవలో పలువురు గాయపడ్డారు.
వరదరాజుపల్లి వద్ద తోపులాట
మర్కుక్ మండలం వరదరాజుపల్లి నుంచి ఎర్రవల్లి వరకు డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆకాంక్షారెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు డప్పులతో ఫామ్ హౌస్ కు బయలు దేరారు. కొంత దూరం రాగానే పోలీసులు వారిని అడ్డుకోగా తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు పోలీసులను తప్పించుకుని ఫామ్ హౌజ్ వైపుగా పరిగెత్తడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తోపులాటలో తూంకుంట నర్సారెడ్డి తలకు, కాలికి గాయాలయ్యాయి. అతన్ని వెంటనే గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. కాలి గాయం నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో కుట్లు వేసి హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. తోపులాటలో రాష్ట్ర పద్మశాలి కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ తోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు.
నేల మైల పడ్డదా..పసుపు నీళ్లతో శుద్ధి చేసిన బీఆర్ఎస్ నేతలు
కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన చావు డప్పు కార్యక్రమంలో భాగంగా వరదరాజుపల్లి నుంచి ఆందోళనకారులు బయల్దేరిన ప్రాంతాన్ని బీఆర్ఎస్ నాయకులు శుద్ధీకరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని బకెట్లలో పసుపు నీళ్లు తీసుకువచ్చి ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారు.