Reading Time: < 1 minute

ఢిల్లీలో శాంతిభద్రతలు కరువు.. మ్యూజిక్ టీచర్ హత్యపై రాహుల్ గాంధీ ఫైర్

Caption of Image.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. మణిపూర్‌‌‌‌కు చెందిన 54 ఏండ్ల మ్యూజిక్ టీచర్ విక్రమ్ సింగ్‌‌‌‌ను తన ఇంటి ముందు మద్యం తాగొద్దన్నందుకు కొందరు దుండగులు దాడిచేయడంతో మృతి చెందారు. ఈ ఘోరంపై ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలకు ఢిల్లీలో భద్రత లేదా? అని కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. 

సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీలోని కిలోకరిలో విక్రమ్ సింగ్ ఇంటి బయట డెలివరీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లు, దాబాల్లో పనిచేసే స్థానిక సిబ్బంది మద్యం సేవిస్తూ.. బిగ్గరగా మాట్లాడుతుండడంతో.. సింగ్ వారి వద్దకు వచ్చి ప్రశ్నించారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. దీంతో వారు ఆయనపై దాడి చేసి.. కొట్టారు. తీవ్రంగా గాయపడిన సింగ్‌‌‌‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు.

ఈశాన్య ప్రజల భద్రతపై రాహుల్ ఆందోళన

మ్యూజిక్ టీచర్‌‌‌‌‌‌‌‌పై దాడి, మృతి ఘటనపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశ రాజధానిలోనే ఓ వ్యక్తి తన ఇంటి బయట హత్యకు గురయ్యారని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలపై ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలో నివసిస్తున్న ఈశాన్య కుటుంబాలు ఇప్పుడు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నాయని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ పోలీసులను ఉద్దేశించి రాజధానిలో శాంతిభద్రతలు ఎందుకు క్షీణిస్తున్నాయని ప్రశ్నించారు. ఘటనపై వేగంగా దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

విక్రమ్‌‌‌‌సింగ్ మృతిపై ఈశాన్య రాష్ట్రాల రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు కూడా స్పందించాయి. ఘటనను తీవ్రంగా ఖండించాయి. మణిపూర్ సీఎం ఖేమ్‌‌‌‌చంద్ యుమ్నామ్, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా సింగ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ ఘటనతో ఢిల్లీలో ఈశాన్య ప్రజలు ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలు మరోసారి ఎత్తిచూపాయని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరారు. 

©️ VIL Media Pvt Ltd.