
సైఫాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్‌ఎస్‌నేతలపై సైఫాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులతో అనుచితంగా ప్రవర్తించడం, దుర్భాషలాడటం, విధులకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేశారు.
ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలించిన అనంతరం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీడియోల్లో కనిపించిన ఘటనలు, వ్యక్తుల పాత్ర ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇదే ఘటనలకు సంబంధించి ఆప్ నాయకురాలు హేమ, బీజేపీ కార్యకర్త గణేశ్‌పైనా కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు మొత్తం మూడు కేసులు నమోదైనట్లు సమాచారం.
మరికొందరి పాత్రపైనా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అంతుకు ముందు.. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ టి.మధుసూదన్ చేసినట్లు పేర్కొంటున్న అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్ ముదిరాజ్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పరిశీలించి, కేసు నమోదు చేయాలని ఆయన పోలీసులను కోరారు.