Reading Time: 2 minutes

ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా.. మన వంటింటిపై ప్రభావం పడే పరిస్థితి మారాలంటే..

Caption of Image.

చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించకుండా భారత్ పూర్తిస్థాయి ఆర్థిక భద్రత సాధించడం కష్టం. సౌర, పవన విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెరగాలి. అయితే కేవలం ఉత్పత్తి సామర్థ్యం పెంచడం సరిపోదు. విద్యుత్ నిల్వ వ్యవస్థలు, ట్రాన్స్​మిషన్  నెట్‌‌వర్క్, గ్రిడ్ సామర్థ్యం కూడా అదేస్థాయిలో అభివృద్ధి చెందాలి. 

ప్రస్తుతం భారత్‌‌లో  సౌర విద్యుత్‌‌లో  కొంత భాగం గ్రిడ్ పరిమితులు, నిల్వ సామర్థ్యం కొరత కారణంగా వినియోగంలోకి రాకుండా పోతోందని తాజా విశ్లేషణలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలను ప్రభుత్వం నియంత్రించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించే చర్యలు మాత్రం తీసుకోవచ్చు.

చమురు ధరలు ఎక్కువకాలం అధికంగా ఉంటే పన్నుల విధానం, వ్యూహాత్మక చమురు నిల్వలు, ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు, దేశీయ ఇంధన ఉత్పత్తి వంటి అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన వస్తువుల ధరలు అదుపు  తప్పకుండా సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాల్సి ఉంటుంది.

ప్రధానంగా సామాన్యుడి కొనుగోలు శక్తి  దెబ్బతినకుండా  చూడటం అత్యంత ముఖ్యం. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగుతాయన్నది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక ప్రశ్న. యుద్ధం కొనసాగితే  చమురు సరఫరాపై మరింత ఒత్తిడి రావచ్చు. దాని ప్రభావం భారత్ సహా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలన్నింటిపై ఎక్కువగా ఉంటుంది.

►ALSO READ | దళితులను దగా చేసిందెవరు దొర గారు ?

అందుకే ఇప్పుడు భారత్ ముందున్న సవాలు కేవలం చమురు ధరలను ఎదుర్కోవడం కాదు. ఆర్థిక స్వావలంబనను వేగవంతం చేయడం. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం మన వంటింటి బడ్జెట్‌‌పై పడే పరిస్థితి మారాలంటే దేశం ప్రత్యామ్నాయ ఇంధనాలు, దేశీయ ఉత్పత్తి, సరఫరా భద్రతపై మరింత దృష్టి పెట్టాలి.

యుద్ధం ఆగాలని ప్రపంచం కోరుకోవడం సహజం. కానీ యుద్ధం జరిగినా భారత ఆర్థిక వ్యవస్థ కుదేలు కాకుండా ఉండే శక్తిని నిర్మించుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అదే ఈ సంక్షోభం మనకు నేర్పుతున్న అతిపెద్ద పాఠం.

ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్

  • * ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
  • * రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
  • * స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
©️ VIL Media Pvt Ltd.