
Ranabaali Teaser: విజయ్ దేవరకొండ నుంచి మరోసారి ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. ఈసారి ఏకంగా బ్రిటిష్ పాలన నాటి చరిత్రను వెండి తెరపైకి తీసుకొస్తున్నాడు. ‘రణబాలి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తుంటే కథలో చరిత్ర, యాక్షన్, డ్రామా కలగలిపి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాంకృత్యాన్ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రణబాలి’ 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో చోటుచేసుకున్న కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. చరిత్రలోని ఓ కీలక కాలాన్ని ఫిక్షన్ అంశాలతో ముడిపెట్టి దర్శకుడు ఎలాంటి కథను చెప్పబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. మరోవైపు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ కాంబినేషన్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా విజయ్ పాత్ర ఎలా ఉండబోతోందన్నది టీజర్ రిలీజ్ తర్వాత అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ‘రణబాలి’ ప్రస్తుతం రిలీజ్‌కి రెడీ అవుతోంది. దసరా కానుకగా అక్టోబరు 16న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీ-సిరీస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు అజయ్ – అతుల్ సంగీతం అందిస్తున్నారు. చరిత్రలోని వాస్తవ ఘటనలకు విజయ్ దేవరకొండ ఇమేజ్, రాహుల్ సాంకృత్యాన్ టేకింగ్ జత కావడంతో ‘రణబాలి’పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.