Reading Time: 2 minutes
Supreme Court Pan India Safety Audit Pg Hostels Student Accommodation

దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌లో పీజీ హాస్టల్ భవనం కూలి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాసుల కక్కుర్తితో కొందరు యజమానులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇష్టానుసారంగా భవంతులు నిర్మించి ప్రాణాలు తీస్తున్నారు. ఢిల్లీ ఘటనలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

తాజాగా ఈ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు నివసించే పీజీలు, ప్రైవేట్ హాస్టళ్లు, స్టూడెంట్ అకామడేషన్ల భద్రతపై విస్తృత స్థాయిలో ఆదేశాలు జారీ చేసే అంశాన్ని పరిశీలించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం సంకేతాలు ఇచ్చింది. ఈ కేసును సెప్టెంబర్ 10న విచారించనున్నట్లు తెలిపింది. మంగళవారం జరిగిన విచారణలో.. ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విద్యార్థుల వసతి గృహాల భద్రతకు సంబంధించిన అంశాలను కూడా పరిధిలోకి తీసుకురావచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

సత్య నికేతన్ ఘటనపై విచారణ

ప్రస్తుతం అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. ఈ కేసులో కోర్టు నియమించిన అమికస్ క్యూరీ అజిత్ కుమార్ సిన్హా.. ఢిల్లీలోని ప్రైవేట్ హాస్టళ్లు, పీజీ అకామడేషన్లపై సమగ్ర భద్రతా ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. సత్య నికేతన్ ఘటన విద్యార్థుల వసతి భద్రతపై ఉన్న విస్తృత సమస్యలను బయటపెట్టిందని ఆయన తెలిపారు. చాలా పీజీలు, ప్రైవేట్ హాస్టళ్లు నివాస భవనాల్లోనే నిర్వహిస్తున్నారని.. వాటిలో నిర్మాణపరమైన మార్పులు, భవనం వినియోగంలో మార్పులు లేదా అనుమతి లేని నిర్మాణాలు జరిగే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

‘దేశవ్యాప్తంగా ఆదేశాలు ఇస్తాం’

ఢిల్లీ పరిపాలన తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సత్య నికేతన్ భవనం కూలిన ఘటనను “భయానక ఘటన”గా అభివర్ణించారు. ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ఎంసీడీ అధికారుల పాత్రపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిందని తెలిపారు. అలాగే ఢిల్లీలోని పీజీలపై నగరవ్యాప్తంగా భద్రతా ఆడిట్ నిర్వహించాలని కూడా హైకోర్టు ఆదేశించిందని వివరించారు. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని తుషార్ మెహతా సూచించారు.

అయితే ఈ సూచనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. “మేము దీనిని బదిలీ చేయడం లేదు. పరిధిని విస్తరిస్తాం. దేశవ్యాప్తంగా (Pan-India) ఆదేశాలు జారీ చేస్తాం. మా మనసులో ఒక విషయం ఉంది” అని జస్టిస్ అమానుల్లా వ్యాఖ్యానించారు.

సత్య నికేతన్‌లో ఏం జరిగింది?

ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న బాలుర పీజీ ఉన్న ఐదు అంతస్తుల భవనం ఇటీవల కూలిపోయింది. ఈ ఘటనలో విద్యార్థులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తులో భవనంలో అనుమతి లేని మార్పులు, బేస్‌మెంట్‌లో పనులు, దశాబ్దాల నాటి భవనం నిర్మాణ బలహీనత వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో భవనం యజమానిని అరెస్టు చేయగా.. ఎంసీడీకి చెందిన కొందరు అధికారులను సస్పెండ్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పీజీలు, హాస్టళ్లపై ఢిల్లీ హైకోర్టు ఆడిట్

మరోవైపు ఢిల్లీ హైకోర్టు కూడా నగరంలోని పీజీలు, హాస్టళ్లపై వారం రోజుల్లో భద్రతా ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. సత్య నికేతన్ విషాదానికి భవనం యజమాని మాత్రమే బాధ్యుడిగా ఉండకపోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. విద్యార్థుల వసతి గృహాల పర్యవేక్షణ బాధ్యత ఉన్న పౌర సంస్థలు, సంబంధిత అధికారుల పాత్ర కూడా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.