Reading Time: 2 minutes
Range Rover Sv Gets New Dual Tone Fade Paint Finish Luxury Bespoke Option

Range Rover SV: లగ్జరీ SUVలలో ప్రత్యేక గుర్తింపు ఉన్న రేంజ్ రోవర్ SVను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు కంపెనీ కొత్త పర్సనలైజేషన్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. రేంజ్ రోవర్ SV బిస్పోక్ ప్రోగ్రామ్‌లో భాగంగా డ్యూయల్-టోన్ ఫేడ్ అనే కొత్త ఎక్స్‌టీరియర్‌ పెయింట్‌ ఫినిష్‌ను పరిచయం చేసింది. ఇందులో రెండు విభిన్న రంగులు ఒకదానితో ఒకటి క్రమంగా కలిసిపోయేలా పెయింట్‌ చేస్తారు. సాధారణంగా కనిపించే షార్ప్‌ పెయింట్‌ లైన్‌కు బదులుగా రూఫ్‌, బానెట్‌ నుంచి సైడ్స్‌, రియర్‌ వరకు రంగులు క్రమంగా మారేలా ఈ ఫినిష్‌ను రూపొందించారు.

నాలుగు ప్రత్యేక కలర్‌ కాంబినేషన్లు..

రేంజ్ రోవర్ SV డుయో-టోన్ ఫేడ్ పెయింట్‌ పాలెట్‌లో నాలుగు ప్రత్యేక కలర్‌ కాంబినేషన్లు ఉన్నాయి. వీటికి అనుగుణంగా డ్యూయల్‌-టోన్‌ ఇంటీరియర్‌ థీమ్‌లను కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ ఇలా ఉన్నాయి.

* వెల్వెట్ డెప్త్స్ అబ్సిడియన్ – సన్‌రైజ్ కాపర్.

* సన్‌స్టోన్ లస్టర్ అబ్సిడియన్ – టూర్మలైన్ బ్రౌన్.

* యాషెన్ అమరాంథైన్ అబ్సిడియన్ – అమెథిస్ట్.

* నాక్రే అల్లూర్ అబ్సిడియన్ – బ్రిటిష్ రేసింగ్ గ్రీన్.

ప్రత్యేకంగా తమకు నచ్చిన విధంగా రేంజ్ రోవర్ SVను రూపొందించుకోవాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఆప్షన్లను అందిస్తున్నారు.

చేతితో పెయింటింగ్‌..

డుయో-టోన్ ఫేడ్ ఫినిష్‌ సాధారణంగా రెండు రంగులు వేయడం కంటే క్లిష్టమైన ప్రక్రియ. ముందుగా ఒక బేస్‌ కలర్‌ను వాహనంపై పెయింట్‌ చేస్తారు. ఆ తర్వాత రెండో రంగును అప్లై చేసి, రెండు షేడ్స్‌ మధ్య ట్రాన్సిషన్‌ స్మూత్‌గా కనిపించేలా చేతితో బ్లెండ్‌ చేస్తారు. ఈ ఫేడ్‌ ఎఫెక్ట్‌ రూఫ్‌, బానెట్‌ ప్రాంతం నుంచి ప్రారంభమై వాహనం సైడ్స్‌ మీదుగా వెనుక భాగం వరకు కొనసాగుతుంది. దీంతో రెండు రంగుల మధ్య స్పష్టమైన గీత కనిపించకుండా ఒక రంగు నుంచి మరో రంగుకు క్రమంగా మారే ప్రీమియం లుక్‌ వస్తుంది.

పెయింటింగ్‌కు ముందు రంగులు, మెటీరియల్స్‌ ఒకదానితో మరొకటి అనుకూలంగా ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో హ్యాండ్‌ ప్రిపరేషన్‌, ప్రెసిషన్‌ పెయింట్‌ అప్లికేషన్‌ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు.

Range Rover SV మార్కెట్‌ను బట్టి పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్‌ వెర్షన్‌లో 4.4 లీటర్‌ ట్విన్‌-టర్బో V8 మైల్డ్‌-హైబ్రిడ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 537hp పవర్‌, 750Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఆల్‌-ఎలక్ట్రిక్‌ Range Rover కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. SV స్పెసిఫికేషన్‌లో వచ్చే ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ గరిష్ఠంగా 600 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్‌ రేంజ్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే వాస్తవ రేంజ్‌ టెస్ట్‌ సైకిల్‌, వీల్‌ సైజ్‌, మార్కెట్‌, వాహన కాన్ఫిగరేషన్‌ను బట్టి మారవచ్చు.

Range Rover SVలో ప్రీమియం ఫీచర్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 13.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 13.7 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే ఉన్నాయి. వెనుక ప్రయాణికుల కోసం ఆప్షనల్‌గా 13.1 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్‌లను కూడా ఎంచుకోవచ్చు. 4 జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, హీటెడ్‌ స్టీరింగ్‌ వీల్‌, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, యాంబియంట్‌ లైటింగ్‌, ఎలక్ట్రిక్‌ రియర్‌ సన్‌బ్లైండ్స్‌, 360-డిగ్రీ కెమెరా, ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సీట్లలో ఎలక్ట్రిక్‌ అడ్జస్ట్‌మెంట్‌తో పాటు హీటింగ్‌, వెంటిలేషన్‌, మెమరీ, మసాజ్‌ ఫంక్షన్లు లభిస్తాయి. కొత్త డుయో-టోన్ ఫేడ్ పెయింట్‌ ఫినిష్‌ ద్వారా Range Rover SVను మరింత వ్యక్తిగతంగా, ప్రత్యేకంగా రూపొందించుకునే అవకాశం లభిస్తుంది. SUV డిజైన్‌ను మార్చకుండా దాని ఎక్స్‌టీరియర్‌కు ప్రత్యేకమైన లగ్జరీ లుక్‌ను అందించడమే ఈ కొత్త Bespoke ఆప్షన్‌ ప్రధాన ఉద్దేశం.

ధర:

ఈ కొత్త డుయో-టోన్ ఫేడ్ పెయింట్‌ ఫినిష్‌కు రేంజ్ రోవర్ ఇంకా ప్రత్యేకమైన ధరను ప్రకటించలేదు. SV Bespoke ప్రోగ్రామ్‌లో భాగంగా కస్టమర్‌ ఎంచుకునే వాహన కాన్ఫిగరేషన్‌, కలర్‌ కాంబినేషన్‌, ఇతర కస్టమైజేషన్‌ అవసరాల ఆధారంగా తుది ధర మారే అవకాశం ఉంది. సాధారణ వెర్షన్‌తో పోలిస్తే ఈ ప్రత్యేక ఫినిష్‌ కోసం అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని భావిస్తున్నారు.