
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ‘ఎపిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ డైరెక్టర్ ఆదిత్య హాసన్‌కు ఎవరైనా ఎదురొస్తే తాను చూసుకుంటానని, 100% ఎవరినీ అతని జోలికి రానివ్వనని విజయ్ ఓపెన్‌గా భరోసా ఇచ్చారు. ఆదిత్య, నాగి, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా లాంటి వారంతా తన మనుషులని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తెలుగు సినిమాకు ఇది అద్భుతమైన సంవత్సరమని, రాబోయే సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అవుతాయని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 11న ఆనంద్ ‘ఎపిక్’, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల ‘పారడైజ్’, రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’, రష్మిక ‘ది మైసా’, తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’, డిసెంబర్‌లో ‘ఫౌజీ’, బాలయ్య ‘దాదా’ లాంటి సినిమాలు వరుసగా రాబోతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సినిమాల్లో దాదాపు నాలుగు చిత్రాల కంటెంట్ తనకు తెలుసని, ఇదొక “ఆపరేషన్ TFI” అని, 100% స్ట్రైక్ రేట్‌తో బాక్సాఫీస్ వద్ద హిట్లు కొట్టబోతున్నామని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో డైరెక్టర్లు, హీరోల అంబిషన్, రైటింగ్ స్కేల్ పెరిగిందని, కానీ టెక్నికల్ టీమ్స్‌లో సరైన సెటప్, ఎఫిషియన్సీ లేకపోవడం వల్లే సినిమాలు డిలే అవుతున్నాయని విజయ్ కుండబద్దలు కొట్టారు. సినిమా పరిశ్రమలో కేవలం 20-30% మాత్రమే స్కిల్డ్ పీపుల్ ఉన్నారని, మిగతా ఇండస్ట్రీ అంతా అన్‌స్కిల్డ్ సెక్టార్‌గా మారిందని ఆయన విమర్శించారు. ఫిల్మ్ స్కూల్స్ నుంచి వచ్చే కొత్త బ్యాచ్‌లతోనే ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని ఆయన విశ్లేషించారు. ఆనంద్ దేవరకొండతో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలను విజయ్ ఎమోషనల్‌గా పంచుకున్నారు. పుట్టపర్తిలో తనను ఫస్ట్ టైమ్ హాస్టల్‌లో వదిలిపెట్టేందుకు వెళ్లినప్పుడు, ఆనంద్ కూడా తనతో పాటే ఉంటానని వెక్కి వెక్కి ఏడ్చాడని గుర్తుచేసుకున్నారు. థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు కూడా ఆనంద్ తన క్లాస్‌రూమ్ డోర్ వెనకాల దాక్కునేవాడని ఆయన తెలిపారు. అమెరికా వెళ్లేటప్పుడు కూడా ఎన్నో భయాలు ఉన్న ఆనంద్, ఇప్పుడు తనకంటూ ఒక సొంత దారిని క్రియేట్ చేసుకున్నాడని విజయ్ గర్వంగా చెప్పారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్య ఒక అద్భుతమైన పెర్ఫార్మర్ అని విజయ్ కొనియాడారు. ఒంటరిగా పోరాడి తన కుటుంబ కష్టాలను, వారి కలలను నెరవేర్చి వారి గ్రాఫ్‌ను ఆమె సింగిల్ హ్యాండెడ్‌గా మార్చేసిందని ప్రశంసించారు. ‘అర్జున్ రెడ్డి’ టైంలో తాను సాధించింది చూసి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలని, అందరికీ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడమే తన బిగ్గెస్ట్ పర్పస్ అని విజయ్ ముగించారు.