Reading Time: 2 minutes
జస్ట్ 10 నిమిషాల్లోనే కరకరలాడే సూపర్ టిఫిన్.. చట్నీతో తింటుంటే ఆ మజానే వేరు..

మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా.. లేదా సాయంత్రం వేళ క్రిస్పీ, రుచికరమైన టేస్టీ అల్పాహారం కోసం ఎదురు చూస్తున్నారా? ఇంకా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే, కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఈ ఇన్స్టెంట్ ఉల్లి బోండా రెసిపీ మీకు సరైన ఎంపిక. పైన కరకరలాడుతూ, లోపల గుల్లగా ఉండే ఈ బోండాలు రుచిలో అద్భుతంగా ఉంటాయి. ఎవరైనా సరే సులువుగా తయారు చేసుకునే ఈ వంటకం తయారీ విధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..

తయారీ విధానం:

పిండి మిశ్రమం తయారీ:

మొదటగా, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3/4 కప్పు లేదా ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఆ తర్వాత, రెండు మీడియం సైజు బంగాళదుంపలను తొక్క తీసి, శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెరుగుతో పాటు జార్‌లో వేయండి. ఈ రెండింటినీ మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ ఎంత మెత్తగా ఉంటే, బోండాలు అంత బాగా వస్తాయి. ఈ మెత్తటి పేస్ట్‌లో, 3/4 కప్పు గోధుమపిండిని వేసుకోండి. గోధుమపిండికి బదులుగా మైదాను కూడా ఉపయోగించవచ్చు, అయితే ఆరోగ్యానికి మంచిదని గోధుమపిండిని వాడటం ఉత్తమం. అదే కప్పుతో 1/4 కప్పు బియ్యప్పిండిని కూడా కలపండి. ఇప్పుడు అన్నింటినీ కలిపి మరోసారి గ్రైండ్ చేయండి. చేతితో కలపడం కంటే ఈ పద్ధతిలో పిండి మరింత సులువుగా, చక్కగా కలుస్తుంది. ఈ గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోండి.

రవ్వ కలిపి నానబెట్టడం:

బౌల్‌లోకి తీసుకున్న బ్యాటర్‌లో హాఫ్ కప్పు ఉప్మా రవ్వను (బొంబాయి రవ్వ లేదా సుజి) వేసి బాగా కలుపుకోండి. ఉప్మా రవ్వ, బంగాళదుంప, బియ్యప్పిండి కలపడం వల్ల బోండాలు బాగా గుల్లగా, క్రిస్పీగా వస్తాయి. పిండిని కలిపిన తర్వాత కొద్దిగా పల్చగా అనిపించవచ్చు, కానీ రవ్వ నీటిని పీల్చుకొని కాస్త గట్టిపడుతుంది. ఒకవేళ ఇంకా పల్చగా అనిపిస్తే, మరొక్క రెండు టేబుల్ స్పూన్ల రవ్వను కలుపుకోవచ్చు. పిండి ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి. ఇలా కలిపిన బ్యాటర్‌ను ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఈ సమయంలో రవ్వ బాగా నాని పిండి గట్టిపడుతుంది.

ఉల్లిపాయలు, మసాలాలు కలపడం:

పిండి నానబెట్టే సమయంలో, మూడు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని పొడవుగా, సన్నగా కట్ చేయండి. కట్ చేసిన ఉల్లిపాయలను చేతితో బాగా నలిపి, పొరలు విడివిడిగా అయ్యేలా చూసుకోండి. ఐదు నిమిషాల తర్వాత, గట్టిపడిన పిండిలో రెండు లేదా మూడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి (లేదా తురిమి), రెండు రెమ్మల సన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి.
దీంట్లోనే ఒక టీస్పూన్ ఉప్పు (మీ రుచికి సరిపడా), చిటికెడు లేదా రెండు చిటికెల వంటసోడా వేసి బాగా కలపండి. వంటసోడా ఎక్కువగా వేస్తే బోండాలు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి జాగ్రత్తగా వాడాలి. చేతితో పిండిని బాగా నలుపుతూ, ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుతున్నప్పుడే ఒక టీస్పూన్ జీలకర్రను కూడా కలపండి. జీలకర్ర మంచి రుచిని, ఫ్లేవర్‌ను ఇస్తుంది.

ఈ మిశ్రమంలో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు, ఉల్లిపాయల్లో ఉండే నీటి శాతం వల్ల పిండి చక్కగా కలిసిపోతుంది. ఒకవేళ పిండి మరీ గట్టిగా అనిపిస్తే, ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు మాత్రమే కలపండి, అంతకంటే ఎక్కువ వద్దు.

డీప్ ఫ్రై చేయడం:

ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి, లో-టు-మీడియం ఫ్లేమ్‌లో వేడి చేయండి. ఆయిల్ కాగిన తర్వాత, ఫ్లేమ్‌ను లో-టు-మీడియం లోనే ఉంచి, కొద్దికొద్దిగా పిండిని తీసుకొని చిన్న లేదా మీడియం సైజు బోండాలుగా ఆయిల్ లో వేయండి. బోండాలు మరీ లావుగా వేయొద్దు, అలా చేస్తే లోపల సరిగ్గా ఉడకవు.
బోండాలను వేసిన వెంటనే తిప్పకండి. ఒకటి లేదా రెండు నిమిషాలు ఆగి, అటూ ఇటూ తిప్పుకుంటూ బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఎక్కువ రంగు వచ్చేవరకు వేయించొద్దు, తీసిన తర్వాత కూడా ఉల్లిపాయల వల్ల రంగు మారుతాయి.

బంగారు రంగులోకి మారిన బోండాలను ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్‌లో వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బోండాలుగా వేయించండి. వేడివేడి బోండాలను పల్లీ చట్నీతో లేదా మీకు నచ్చిన ఏదైనా చట్నీతో తింటే అద్భుతంగా ఉంటాయి. పల్లీ చట్నీతో అయితే వాటి రుచి మరింత పెరుగుతుంది. లోపల గుల్లగా, పైన కరకరలాడుతూ ఉండే ఈ బోండాలు కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకునే బెస్ట్ ఇన్స్టెంట్ స్నాక్. తప్పకుండా ప్రయత్నించి చూడండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..