
‘నందూస్ వరల్డ్’తో యూట్యూబ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రామ నందన అలియాస్ నందు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఒకవైపు విదేశీ ఉద్యోగాలు, వీసా స్పాన్సర్‌షిప్ పేరుతో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతోంది. మరోవైపు ఆమె పేరు బిగ్‌బాస్ తెలుగు 10 వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కోసం గట్టిగా వినిపిస్తోంది. దీంతో అసలు నందన లండన్ నుంచి హైదరాబాద్‌కు ఎందుకు వచ్చారన్నది ఇప్పుడు చర్చనీయాంశగా మారింది.
ఇన్నాళ్లూ లండన్‌లో ఉన్న నందన సెప్టెంబర్ 7, 2026న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఒంటరిగా హైదరాబాద్ చేరుకున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమెపై ఏపీ పోలీసులు ఇప్పటికే లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెకు 41ఏ నోటీసులు ఇచ్చి ఈ రోజు ( సెప్టెంబర్ 8, 2026 ) విచారించారు.
వీసా, విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు, కేసులు నందన, ఆమె భర్త మధుకర్‌పై ఉన్నాయి. ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరుతో షెల్ కంపెనీలు నడిపి.. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. నకిలీ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) లెటర్ల వ్యవహారంపైనా పోలీసులు దృష్టి పెట్టారు.
ఈ రోజు పోలీసుల విచారణలో ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, మొత్తం వ్యవహారాలను తన భర్త మధుకర్ చూసుకునేవారని నందన చెప్పినట్లు సమాచారం. అయితే పలు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. మధుకర్‌ను కూడా విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 6న 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. షో మొదలుకాకముందే నందన పేరు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు లండన్ నుంచి ఆమె హైదరాబాద్‌కు సడెన్ గా రావడం ఆ ప్రచారానికి మరింత ఊపునిచ్చింది. మరి నందన హైదరాబాద్‌కు వచ్చింది పోలీసుల విచారణ కోసమేనా? లేక బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చారా? అన్నది సస్పెన్స్ గా నెలకొంది.
ALSO READ : అంతా నా భర్తకే తెలుసు.. వీసా స్కామ్‌పై పోలీసుల విచారణలో యూట్యూబర్ నందు!
ఒకవేళ ఆమె నిజంగానే హౌస్ లోకి వైల్డ్‌కార్డ్‌గా అడుగుపెడితే.. ఇప్పటికే కేసు చుట్టూ నెలకొన్న హైప్‌కు బిగ్‌బాస్ ఎంట్రీ మరింత మసాలా జోడించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి నందన ఎంట్రీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ప్రస్తుతానికి ఇది వైరల్ అవుతున్న ప్రచారం మాత్రమేనా.. లేక త్వరలో హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కొత్త ట్విస్ట్‌నా? అన్నదే సస్పెన్స్‌గా మారింది. మరి ఈ నెల 16న జరగబోయే రెండో విచారణ లోపు న్యాయపరమైన చిక్కులు దాటుకుని నందన బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి తన వెర్షన్ వినిపిస్తుందో లేదో చూడాలి..