
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మద్యం విధానం, మద్యం షాపుల నిర్వహణపై తీవ్ర హెచ్చరికలతో కూడిన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాల లైసెన్సులను మరో ఏడాది వరకు రెన్యూవల్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నూతన మద్యం విధానం , స్థానిక సంస్థల నిర్వహణ పరంగా ఎదురవుతున్న అంశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత వ్యవస్థనే కొనసాగిస్తూ లైసెన్సుల కాలాన్ని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మద్యం విక్రయాల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గరిష్ట రిటైల్ ధర (MRP) కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడానికి వీల్లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటి తప్పుకే రూ. 5 లక్షల వరకు భారీ జరిమానాతో పాటు రెండవసారి ఉల్లంఘనకు పాల్పడితే దుకాణం లైసెన్స్‌ను రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. అలాగే అక్రమంగా నిర్వహించే బెల్ట్ షాపులు, నాన్ డ్యూటీ పైడ్ లిక్కర్ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, సీసీటీవీ కెమెరాలు, టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా విక్రయాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులకు (మంత్రులు, ఎమ్మెల్యేలు) సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. తమ తమ నియోజకవర్గాల్లో మద్యం విధానాన్ని , విక్రయాలను సంపూర్ణంగా ‘సెట్ రైట్’ చేసుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనని స్పష్టం చేశారు. సిండికేట్లుగా ఏర్పడటం, మద్యం వ్యాపారుల వద్ద వాటాలు డిమాండ్ చేయడం లేదా బెదిరింపులకు పాల్పడటం వంటి అక్రమ చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానాలను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అమలు చేయాలని, ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ప్రజాప్రతినిధులు, అధికారులు ఉమ్మడిగా స్వీకరించాలని సీఎం కోరారు.