Reading Time: 2 minutes

అసెంబ్లీ జరగకుండా ..ఇదంతా కేసీఆర్ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరగకుండా ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుట్రలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్ర చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉసిగొల్పారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగితే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన వైఫల్యాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.బీఆర్ఎస్ సభ్యులను ఉన్మాదుల్లా మార్చి సభకు పంపించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కసబ్ తరహాలో బీఆర్ఎస్ సభ్యులు దాడులకు వచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై కూడా బీఆర్ఎస్ సభ్యులు దాడులు చేశారని అన్నారు.

స్పీకర్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

గౌరవ పదవిలో ఉన్న వ్యక్తిని, ఆయన తల్లిని అవమానించడం ఎంతవరకు సమంజసమని సీఎం ప్రశ్నించారు. స్పీకర్ స్థానాన్ని, స్పీకర్ తల్లిని అవమానించేలా వ్యవహరించడం దారుణమన్నారు. ఉన్మాదంతో వచ్చి మూక దాడులకు దిగిన బీఆర్ఎస్ సభ్యులు, సభాపతికి జరిగిన అవమానంపై ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదని విమర్శించారు.స్పీకర్‌కు జరిగిన అవమానానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ స్వయంగా క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఫామ్‌హౌస్ వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన

ఫామ్‌హౌస్ వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా దండోరాతో నిరసన తెలిపామని సీఎం చెప్పారు. దళిత సోదరులు ఏ కార్యక్రమం జరిగినా డప్పు కొట్టడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. దాన్ని వక్రీకరించి రాజకీయ వివాదం చేయడం సరికాదన్నారు.

గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. అణచివేతకు గురైన వర్గాలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అండగా నిలిచారని, ఆయన సారథ్యంలో భారత రాజ్యాంగం రూపుదిద్దుకుందని గుర్తుచేశారు.దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. దళితులు, ఆదివాసీల గౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ కృషి చేసిందని పేర్కొన్నారు.

ఖర్గే అవమానంపై దేశవ్యాప్త నిరసనలు

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 60 ఏళ్లుగా విరామం లేకుండా ప్రజా జీవితంలో పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్త స్థాయి నుంచి ఏఐసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన ఖర్గేను అవమానించడం బాధాకరమన్నారు.ఉత్తరాఖండ్‌లో ఖర్గే పాల్గొన్న సభను బీజేపీ నేతలు శుద్ధి చేశారని సీఎం ఆరోపించారు. ఖర్గేకు జరిగిన అవమానాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాజ్యసభలో బీజేపీ వైఫల్యాలను ఖర్గే ఎండగట్టారని, అందుకే ఆయనపై రాజకీయంగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగ విలువలు, సామాజిక గౌరవం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.