
- విద్యార్థులతో విగ్రహాల తయారీ
- వారి ఇండ్లలోనే ప్రతిష్ఠించేలా అవగాహన
- రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు :పీసీబీ ఈ ఏడాది భారీ స్థాయిలో మట్టి గణపతుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రూ.1.30 కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రవ్యాప్తంగా 3.26 లక్షలకు పైగా మట్టి విగ్రహాలను ప్రజలకు అందజేయాలని టార్గెట్పెట్టుకున్నది. ఇందులో ఒక్క క్యూర్ పరిధిలోనే 2.16 లక్షలు, మిగతా ప్రాంతాల్లో మరో1.25 లక్షల విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది.
క్యూర్ పరిధిలో ఒక్కో మట్టిగణపతికి రూ. 36, నాన్ క్యూర్ పరిధిలో రూ. 41 ఖర్చు చేయనున్నది. ఈ సందర్భంగా సోమవారం టీజీపీసీబీ మెయిన్ ఆఫీసులో పర్యావరణ పరిరక్షణ .. విద్యార్థులతో మట్టి వినాయకుల తయారీ వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో ఐదు స్కూల్స్‌కు చెందిన 110 మంది విద్యార్థులు పాల్గొనగా..బంకమట్టితో అప్పటికప్పుడు మట్టి విగ్రహాలను తయారు చేయించారు.
నేటి నుంచి స్కూల్స్‌లో..
మంగళవారం నుంచి 12వ తేదీ వరకు సిటీలోని 20 స్కూళ్లలో మట్టి విగ్రహాల తయారీ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించనున్నట్టు టీజీపీసీబీ సభ్య కార్యదర్శి రవి తెలిపారు. ఈ విగ్రహాలను వారి ఇండ్లలోనే ప్రతిష్ఠించుకునేలా చూస్తామన్నారు.
వీటితో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆటోల వెనుక మట్టి వినాయకుల గురించి ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు. సికింద్రాబాద్ గణేశ్ ఆలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, కర్మన్‌ఘాట్, జోగులాంబ గద్వాల లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మట్టి గణపతుల తయారీ విధానంపై అవేరెనెస్ ప్రోగ్రాంలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
ప్రతి జిల్లాలో టీజీపీసీబీ తరఫున ఒక నోడల్ ఆఫీసర్ ను ప్రత్యేకంగా నియమించి ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ బి. రఘు, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కృపానంద్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శకుంతల, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డా. జె.సుమతి, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వినయ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు.
10 వేల సీడ్ గణేశులు..
వినాయక చవితి సందర్భంగా ‘ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్’ ఆధ్వర్యంలో10 వేల సీడ్ (విత్తన) గణేశ్ విగ్రహాల పంపిణీ చేయనున్నారు. ఇందులో నగరంలో 5 వేలు, బెంగళూరులో 5 వేలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా కంపెనీ మార్కెటింగ్ హెడ్ చేతన్ పింపాల్‌ఖుటే సీడ్ గణేశ్ విగ్రహాలను పంపిణీ చేసే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
రిడ్జ్ టవర్స్, మై హోమ్ జ్యువెల్, మలేషియన్ టౌన్‌షిప్స్ రెయిన్ ట్రీ పార్క్, రెయిన్‌బో విస్టాస్ తదితర ప్రముఖ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లకు ఈ విగ్రహాలను అందించనున్నాయి. మట్టితో తయారై, నీటిలో సులభంగా కరిగిపోయే ఈ సీడ్ గణేశ్ విగ్రహాల వల్ల నిమజ్జనం తర్వాత అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయని, ఇది పర్యావరణానికి మేలు చేస్తుందని సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు.