దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం ఒకటి. ఈ పవిత్ర స్థలాన్ని భక్తులు అత్యంత ప్రేమగా ‘భూలోక వైకుంఠం’, ‘దక్షిణ ద్వారక’ అని పిలుచుకుంటారు. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు కన్నయ్య దివ్య దర్శనం కోసం ఇక్కడకు తరలివస్తుంటారు. అసలు ఈ క్షేత్రానికి గురువాయూర్ అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అద్భుతమైన స్థల పురాణ గాథ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ద్వారక సముద్రంలో మునిగిన వేళ: పురాణాల ప్రకారం ద్వాపరయుగం ముగిసే సమయంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ఇక ఆ సమయంలో ద్వారకలో పూజలందుకున్న కృష్ణుడి దివ్య విగ్రహం నీటిపై తేలుతూ కనిపిస్తే, దేవతల గురువైన బృహస్పతి మరియు వాయుదేవుడు కలిసి ఆ విగ్రహాన్ని సముద్రం నుంచి తెచ్చి కేరళలోని ఈ ప్రదేశంలో ప్రతిష్టించారు.

‘గురువాయూర్’ పేరు వెనుక రహస్యం; దేవతల గురువు ‘గురు’ (బృహస్పతి), ‘వాయు’దేవుడు ఇద్దరూ కలిసి ఈ స్వామివారి ప్రతిష్టాపన చేశారు. అందుకే ఈ పవిత్ర ప్రదేశానికి ‘గురువాయూర్’ అనే పేరు వచ్చింది. ఇక ఇక్కడ కొలువైన కన్నయ్యను భక్తులు ప్రేమగా ‘గురువాయూరప్పన్’ అని పిలుస్తారు. ద్రవిడ భాషలో ‘అప్పన్’ అంటే తండ్రి అని అర్థం. తమను కన్నబిడ్డలా కాపాడే తండ్రిగా స్వామివారిని ఆరాధిస్తారు.
అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం: త్రిశూర్ నగరానికి దగ్గర్లో ఉండే ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక అపూర్వమైన దివ్యానుభూతి కలుగుతుంది. మంత్రోచ్ఛారణలు, ధూపదీపాల సువాసనలు, గంటానాదాలు మనసును ప్రశాంతత వైపు తీసుకెళ్తాయి. ఇక మహర్షులు చేసే కఠిన తపస్సుల వల్ల లభించే పుణ్యఫలం, గురువాయూరప్పన్ చిన్ని కృష్ణుడి రూపాన్ని దర్శించుకుంటే లభిస్తుందని భక్తుల నమ్మకం.
కష్టాలను తొలగించి కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా గురువాయూర్ శ్రీకృష్ణుడు వెలిగొందుతున్నాడు. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక శోభతో విలసిల్లే భూలోక వైకుంఠం ఈ గురువాయూర్ క్షేత్రం.
గమనిక: గురువాయూర్ ఆలయంలో సాంప్రదాయ వస్త్రధారణ నిబంధనలు (Dressing Code) చాలా కఠినంగా ఉంటాయి. పురుషులు ముండూ (ధోవతి), స్త్రీలు చీర లేదా లంగా ఓణి ధరించి మాత్రమే ఆలయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది
The post కన్నయ్య కొలువైన గురువాయూర్.. ఈ పవిత్ర క్షేత్రాన్ని ‘భూలోక వైకుంఠం’ అని ఎందుకు అంటారు? appeared first on Manalokam – Latest Telugu News & Updates.