Reading Time: 2 minutes
Bihar Liquor Smuggling Woman Student Arrested With Branded Liquor Bottles In Patna

Bihar Liquor Smuggling: బీహార్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, మద్యం అక్రమ రవాణాకు ముఠాలు ఇప్పుడు కొత్త దారులను వెతుక్కుంటున్నాయి. పోలీసులు కన్నుగప్పేందుకు అందమైన యువతులను, మహిళలను పావులుగా వాడుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సమస్తిపూర్‌లో నేహా అనే యువతి అరెస్ట్ అయిన ఘటన మరువకముందే, రాజధాని పట్నాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న రియా అనే విద్యార్థిని మద్యం సీసాలతో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటన పట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పట్నా జంక్షన్ పరిసర ప్రాంతాలకు భారీగా అక్రమ మద్యం సరఫరా కాబోతోందని కొత్వాలి ఏఎస్పీ (లా అండ్ ఆర్డర్) కృష్ణ మురారి ప్రసాద్‌కు గుప్త సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్టేషన్ పరిసరాల్లో నిఘా తీవ్రం చేశారు. అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న రియాతో పాటు కొందరు యువకులను అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో రియా వద్ద ఉన్న హ్యాండ్‌బ్యాగ్, షోల్డర్ బ్యాగ్‌లలో దాదాపు రూ.14,000 విలువైన అర డజనుకు పైగా విదేశీ బ్రాండెడ్ మద్యం సీసాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్నాకు చెందిన రియా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి అని, ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోందని తెలిసింది. కేవలం సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపించడంతోనే తాను ఈ పనికి ఒప్పుకున్నట్లు ఆమె స్పష్టం చేసింది. తనకు తెలిసిన ఒక యువకుడు డబ్బులు ఇస్తానని ఆశ చూపడంతో, అతడి మాటలు నమ్మి ఉత్తరప్రదేశ్ వెళ్లి అక్కడి నుంచి రైలులో మద్యాన్ని పట్నాకు చేర్చినట్లు చెప్పింది. గతంలో తానెప్పుడూ ఇలాంటి పనులు చేయలేదని, కేవలం డబ్బుల ఆశతో మొదటిసారి మాత్రమే ఈ తప్పు చేశానని ఆమె పోలీసులకు తెలిపింది. రైలు దిగి బ్యాగులతో బయటకు రాగానే బైక్‌పై వెళ్తుండగా పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ప్రస్తుతం రియాను ఈ పనికి పురికొల్పిన ఆ యువకుడి పాత్రపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మద్యం ఖేప్‌ను పట్నాలో ఎవరికి అందజేయాల్సి ఉంది, ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఇందులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే విషయాలపై పోలీసులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉండగా, కొద్దిరోజుల క్రితమే సమస్తిపూర్‌లో నేహా అనే యువతిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఢిల్లీ నుంచి ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీలో బ్రాండెడ్ మద్యం సీసాలను తన బావతో కలిసి బీహార్‌కు తరలిస్తుండగా పట్టుబడింది. నేహా కుటుంబం మొత్తానికి ఈ దందాలో హస్తం ఉందని, వారు ప్రముఖ డాక్టర్లు, సంపన్నులకే ప్రధానంగా ఈ మద్యాన్ని సరఫరా చేసేవారని విచారణలో తేలింది. ఒకదాని తర్వాత ఒకటిగా వెలుగుచూస్తున్న ఈ ఘటనలు బీహార్‌లో మద్యం మాఫియా ఏ స్థాయిలో యువతను, మహిళలను వాడుకుంటోందో కళ్ళకు కడుతున్నాయి.