
హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సుమంత్ కు కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించిన తర్వాత సుమంత్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.
కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులకు సూచించిన కోర్టు.. దర్యాప్తునకు సుమంత్ పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేయడం, ప్రలోభపెట్టడం లేదా బెదిరించడం వంటి చర్యలకు పాల్పడకూడదని ఆదేశించింది.
దర్యాప్తు అధికారి అవసరమైనప్పుడు పిలిస్తే తప్పనిసరిగా హాజరు కావాలని సూచించింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా సుమంత్ మొబైల్ నంబర్లు, ఇంటి అడ్రసు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కు అందించాలని సుమంత్‌ను ఆదేశించింది.
కోర్టు విధించిన అన్ని షరతులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేస్తూ నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.