Reading Time: 2 minutes
Revanth Reddy Kcr Brs Assembly Controversy Telangana

శాసనసభ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీపై, మాజీ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో అణచివేత, దోపిడీ పెరిగిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ ప్రజల స్వేచ్ఛ, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిలబడిందని గుర్తుచేశారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతూ, చివరికి దళిత సమాజ తీవ్ర అవమానానికి కారణమైన బీఆర్‌ఎస్ అధినేతను, ఆయన పార్టీని ప్రజలే సామాజికంగా బహిష్కరించాలని సీఎం పిలుపునిచ్చారు.

అసెంబ్లీలో కుట్రలకు ఫామ్‌హౌస్ కేంద్రం

సభలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అప్పులపై నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే కేసీఆర్ తన ఎమ్మెల్యేలను ఉసిగొల్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. శాసనసభ ప్రారంభానికి ముందు రోజు రాత్రి ఫామ్‌హౌస్‌లో సమావేశమై, సభను ఏ విధంగా అడ్డుకోవాలో పథకం రచించారని మండిపడ్డారు. దేశంపై దాడి చేసిన ఉగ్రవాదులకు, సభలో స్పీకర్ స్థానాన్ని, అధికారులను ఉన్మాదంతో అవమానించిన బీఆర్‌ఎస్ నేతలకు ఏమాత్రం వ్యత్యాసం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

దళితులను అవమానిస్తే సహించేది లేదు

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద దళితులు నిరసన తెలిపి వచ్చిన నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయడంపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే తమ పార్టీ నేతలు ఈ శుద్ధీకరణకు పాల్పడ్డారని ఆ రోజే స్పష్టమైందన్నారు. సమాజాన్ని దొరలు, దళితులు అని రెండుగా విభజించే నైజం కేసీఆర్‌దని విమర్శించారు. నేలను కాదు, బీఆర్‌ఎస్ నేతల మనస్సుల్లో ఉన్న కుల అహంకారాన్ని, కుళ్లును యాసిడ్‌తో శుద్ధి చేయాలని ఆక్రోశం వెళ్లగక్కారు.

ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం

ఈ వరుస పరిణామాలపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని, కుట్రలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తు కోసం అధికారి విజయ్ కుమార్‌ను నియమిస్తున్నట్లు సభలో ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరిగిన కుట్రలు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, శాంతిభద్రతల సమస్యలు , విధుల్లో ఉన్న పోలీసులపై జరిగిన దాడులన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని చెప్పారు.

స్పీకర్‌కు అండగా ఉంటాం

అసెంబ్లీ స్పీకర్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించదని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొంతమందికి కోర్టుల నుంచి బెయిల్ రావచ్చు కానీ, ప్రజల మనస్సుల్లో వారి పాపాలు ఎప్పటికీ చెరిగిపోవని అన్నారు. నిజాం రాజునైనా మట్టికరిపించిన తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు చేసేవారిని ఉప్పుపాతర వేయడం ఖాయమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.