Reading Time: < 1 minute
Chandrababu Naidu Konaseema Tour Farmers Meet Tdp Meeting

CM Chandrababu Schedule Today: నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అంబాజీపేట మండలంలో పలు అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. సీఎం చంద్రబాబు ఉదయం 10:30 గంటలకు ఇరుసుమండ హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. అనంతరం మాచవరం జయంతినగర్‌లో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నారు.

ఆ తర్వాత పండువారిపేటలో నిర్వహించే గ్రామసభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. గ్రామసభలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించడంతో పాటు రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజలతో సీఎం మమేకం కానున్నారు. మధ్యాహ్నం బుడుంగపేటలో టీడీపీ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. స్థానికంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై కూడా సీఎం సూచనలు చేసే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం జెడ్ ప్లస్ భద్రతా పరిధిలో ఉన్నందున సీఎంవో ఆదేశాల మేరకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎం పర్యటన సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. పర్యటన ముగించుకుని చంద్రబాబు సాయంత్రం 4:55 గంటలకు ఇరుసుమండ నుంచి ఉండవల్లికి బయలుదేరనున్నారు.