
Naman Dhir: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్, యంగ్ సంచలనం నమన్ ధీర్ షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ 2026లో నభూతో నభవిష్యత్ అన్నట్లుగా చెలరేగిపోయాడు. అభిషేక్ శర్మ సారథ్యంలోని అమృత్‌సర్ సూర్మాస్ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన నమన్ ధీర్, మొహాలీ కింగ్స్‌పై 173 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు రెండు సెంచరీలతో 86 సగటు, 218.27 సబ్‌లైమ్ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 430 రన్స్ సాధించాడు. 360 డిగ్రీల షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా టీ20 జట్టు తలుపులు తడుతున్నాడు.
సంజు శాంసన్ స్థానానికి గండం.. యంగ్ ఓపెనర్ల హవా:
ఒకవేళ నమన్ ధీర్ భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తే, మొదటగా జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం సంజు శాంసన్‌కే పొంచి ఉంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆగమనం తర్వాత శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెగ్యులర్ చోటు కోల్పోగా, చివరి నాలుగు టీ20 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 33 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆరంభంలో ఓపెనర్‌గా కూడా విధ్వంసం సృష్టించగల నమన్ ధీర్ జట్టులోకి వస్తే, టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత ఫామ్ లేమితో తంటాలు పడుతున్న సంజుపై వేటు పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ALSO READ : 28 ఏళ్ల తర్వాత ఒకే రోజు రెండు మ్యాచ్‌లు: గిల్ సేన ఇక్కడ.. అయ్యర్ టీమ్ అక్కడ..
రింకూ సింగ్‌కు దక్కని ఫామ్.. నమన్ మల్టీ టాలెంట్:
మరోవైపు నమన్ ధీర్ మల్టీ-టాలెంట్ కారణంగా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ స్థానానికి కూడా ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026 తర్వాత రింకూ సింగ్ తన ఫామ్‌ను కోల్పోయి, గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 12.2 సగటుతో 61 రన్స్ మాత్రమే చేశాడు. కానీ నమన్ ధీర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి 182.3 స్ట్రైక్ రేట్‌తో ఫినిషర్‌గానూ అదరగొట్టాడు. అటు ఓపెనింగ్, ఇటు లోయర్ ఆర్డర్‌లోనూ భారీ సిక్సర్లు బాదగల నమన్ ధీర్‌ను రింకూ సింగ్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకునేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపే ఛాన్స్ ఉంటుంది.
వాషింగ్టన్ సుందర్‌కు చెక్.. ఆల్‌రౌండర్ కోటాలో చోటు:
అంతేకాకుండా, వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని కూడా నమన్ ధీర్ భర్తీ చేయగలడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, టీ20ల్లో సుందర్ బ్యాటింగ్ సగటు (15.5), స్ట్రైక్ రేట్ (126.8) ఆశించిన స్థాయిలో లేవు. పైగా తరచూ గాయాల బారిన పడటం సుందర్‌కు మైనస్‌గా మారింది. నమన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు కట్టుదిట్టమైన ఆఫ్‌స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. దీంతో సుందర్ కంటే మరింత ధనాధన్ బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న నమన్ ధీర్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.