
స్టార్స్‌కు గాయాలు అవుతున్నాయి. సినిమాలకు బ్రేకులు పడుతున్నాయి. కానీ సినిమాల స్పీడ్ మాత్రం తగ్గడం లేదా? బాలకృష్ణ, ఎన్టీఆర్, రష్మిక… ముగ్గురు గాయాల నుంచి పూర్తిగా కోలుకోకముందే మళ్ళీ సెట్స్ వైపు చూస్తున్నారా? సినిమాల కోసం రిస్క్ చేయడం తప్పు కాదు కానీ, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు తీయడం ఎంతవరకు కరెక్ట్? స్టార్స్‌కు ఇది కమిట్మెంటా లేక ఓవర్ కాన్ఫిడెన్సా?
బాలకృష్ణ ఎన్బీకే 109 షూటింగ్‌లో మోకాలికి గాయమై సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్న బాలకృష్ణ సెప్టెంబర్ నుంచే మళ్ళీ షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ఇక సెప్టెంబర్ 6న ఎన్బీకే 109 టైటిల్ గ్లిమ్స్‌తో పాటు రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ ప్రకటించారు. అంటే గాయం తర్వాత రెస్ట్ తీసుకున్నా, సినిమా విషయంలో మాత్రం బాలయ్య స్పీడ్ తగ్గించుకోవడం లేదు. మరి డాక్టర్లు మరింత విశ్రాంతి సూచించినా షూటింగ్‌కు ఇంత తొందర ఎందుకు? ఇదే ఇప్పుడు చర్చగా మారుతుంది.
ఎన్టీఆర్ కూడా భుజానికి సర్జరీ తర్వాత ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్నాడు. అయినా మరో రెండు వారాల్లో ‘డ్రాగన్’ షూటింగ్‌ను మళ్ళీ మొదలు పెట్టనున్నట్లు నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చాడు. ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి చేసి, ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్‌కే సినిమాను తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్. బాలీవుడ్ నుంచి అలియా భట్, షాహిద్ కపూర్ లాంటి భారీ స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ సెట్స్‌కు దూరంగా ఉన్నా, ఆయన లేని సీన్లను ప్రశాంత్ నీల్ ఇతర నటీనటులతో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి గాయం నుంచి కోలుకుంటున్న ఎన్టీఆర్‌కు రెస్ట్ ముఖ్యమా, లేక డ్రాగన్ షెడ్యూల్ ముఖ్యమా? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాడో చూడాలి.
రష్మిక కూడా ‘మైసా’ షూటింగ్‌లో గాయపడి దాదాపు ఆరు వారాలు బెడ్ రెస్ట్ తీసుకుంది. ఇప్పుడు కోలుకొని మళ్ళీ షూటింగ్ షెడ్యూల్స్‌లోకి ఎంటర్ అయింది. రీసెంట్ గా ‘రణబాలి’ షూటింగ్‌లో జాయిన్ అయింది. ‘మైసా’ రిలీజ్ పనులు కూడా ముందుకు సాగుతున్నాయి. ఇంత గ్యాప్ వచ్చినా వరుస కమిట్మెంట్స్‌ను పూర్తి చేయాల్సిందే అన్నట్టుగా రష్మిక స్పీడ్ కనిపిస్తోంది. మరి రికవరీ పూర్తయిందనే నమ్మకంతోనే ఈ స్పీడా, లేక కెరీర్ గ్యాప్ వస్తుందనే భయమా అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
బాలకృష్ణ, ఎన్టీఆర్, రష్మిక… ముగ్గురు గాయాల కారణంగా షూటింగ్స్‌కు దూరమయ్యారు. కానీ కోలుకున్న వెంటనే ముగ్గురి ఫోకస్ మళ్ళీ సినిమాలపైనే పడింది. బాలకృష్ణ ఎన్బీకే 109 టైటిల్, రిలీజ్ డేట్‌తో మరింత హైప్‌కు రెడీ అవుతుంటే, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్ కూడా త్వరలోనే రీస్టార్ట్ కానుంది. మరోవైపు రష్మిక వరుస షూటింగ్స్‌తో బిజీ అవుతోంది. స్టార్స్‌కు సినిమాలు ముఖ్యం కావచ్చు. కానీ గాయాల తర్వాత కూడా ఇదే స్పీడ్ కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్? సినిమాల కోసం ఆరోగ్యంతోనే పోటీ పడుతున్నారా? అనే చర్చ కూడా వినిపిస్తోంది.