
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ మహా గోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతిన్న ఘటనపై టీటీడీ స్పందించింది. విగ్రహం దెబ్బతిన్న విషయాన్ని టీటీడీ సిబ్బంది ముందుగానే గుర్తించారని, ఈ ఘటనలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోలేదని స్పష్టం చేసింది.
శ్రీవారి ఆలయ మహా గోపురంపై వందలాది విగ్రహాలు ఉన్నాయని టీటీడీ తెలిపింది. దీర్ఘకాలంగా ఎండ, వర్షాలకు విగ్రహాలు గురవుతుండటంతో కాలక్రమేణా కొన్ని విగ్రహాలకు మరమ్మతులు అవసరమయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది.
ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ గోపురానికి పెయింటింగ్, మరమ్మతుల పనులు చేపడుతున్న సమయంలో విగ్రహాల పరిస్థితిని కూడా పరిశీలిస్తామని టీటీడీ వెల్లడించింది.విగ్రహాల పరిస్థితిని బట్టి అవసరమైన చోట మరమ్మతులు చేయడం లేదా దెబ్బతిన్న విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
ఇదే క్రమంలో ప్రస్తుతం గోపురానికి పెయింటింగ్, మరమ్మతుల పనులు జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి మరమ్మతులు అవసరమైన విషయాన్ని సిబ్బంది గుర్తించినట్లు టీటీడీ తెలిపింది. వెంటనే సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారని వెల్లడించింది.
ఈ ఘటనపై వాస్తవాలను తెలుసుకోకుండా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదని టీటీడీ స్పష్టం చేసింది. ఆలయ పవిత్రతకు సంబంధించిన అంశాలపై భక్తుల్లో అపోహలు, ఆందోళనలు కలిగించేలా దుష్ప్రచారం చేయవద్దని టీటీడీ హితవు పలికింది. ఆలయ నిర్వహణ, మరమ్మతుల పనులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే సమాచారాన్ని ప్రచారం చేయాలని సూచించింది.