
భారతీయ మార్కెట్‌లో టెక్ దిగ్గజం శామ్‌సంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, AIపై పెరుగుతున్న పెట్టుబడులు, ఆశించిన స్థాయిలో లేని అమ్మకాల కారణంగా ఉద్యోగుల లేఆఫ్ కి తెరలేపింది. నష్టాలను పూడ్చుకునే క్రమంలో తొలి విడతగా 100 మంది ఎగ్జిక్యూటివ్‌లను తొలగించింది. ముఖ్యంగా టెలివిజన్, హోమ్ అప్లయెన్సెస్ విభాగాలపై ఈ లేఆఫ్స్ ప్రభావం తీవ్రంగా పడింది. హెడ్‌క్వార్టర్స్‌లోని డైరెక్టర్ స్థాయి అధికారులు, టీమ్ లీడ్ల నుంచి ఫీల్డ్ లెవెల్ బ్రాంచ్ మేనేజర్ల వరకు లేఆఫ్స్ జరగటం కలకలం రేపుతోంది.
మెమరీ చిప్స్ ధరలు భారీగా పెరగడం, ముడిపదార్థాల ధరల భారం, స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ మందగించడం శామ్‌సంగ్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్లోబల్ చిప్ కొరత సమస్య రాబోయే కాలంలోనూ కొనసాగే అవకాశం ఉండటంతో కంపెనీ ముందుచూపు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం టీవీ, హోమ్ అప్లయెన్సెస్ యూనిట్లకే పరిమితమైన ఈ లేఆఫ్స్.. త్వరలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉంది. ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోని సేల్స్ సిబ్బందిలో దాదాపు 25 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఉద్యోగం కోల్పోయిన వారికి 3 నెలల జీతంతో పాటు, ప్రతి ఏటా సర్వీసుకు అదనంగా మరో నెల జీతాన్ని సెవెరెన్స్ ప్యాకేజీ కింద శామ్‌సంగ్ అందిస్తోంది.
►ALSO READ | బ్యాంకులో రెండున్నర కోట్లున్నాయ్.. లండన్‌లో రూ.77 లక్షల జాబ్ ఆఫర్‌పై డైలమాలో టెక్కీ
శామ్‌సంగ్ ఇండియాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ డివిజన్‌ను మాత్రం ప్రస్తుతానికి ఈ లేఆఫ్స్ నుంచి మినహాయించారు. దేశీయ ఆదాయంలో ముప్పావు వంతు స్మార్ట్‌ఫోన్ల ద్వారానే వస్తున్నప్పటికీ.. ఈ విభాగంలోనూ అమ్మకాలు 11 నుంచి 12 శాతం వరకు తగ్గాయి. మరోవైపు ప్రీమియం ఎయిర్ కండిషనర్ల సెగ్మెంట్‌లో పట్టు సాధించడానికి కంపెనీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ ఖర్చుల నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్ నెట్‌వర్క్‌లను కూడా శామ్‌సంగ్ క్రమక్రమంగా విలీనం చేస్తూ వస్తోంది.
అయితే మరో విశేషమేమిటంటే.. గత ఆర్థిక సంవత్సరంలో శామ్‌సంగ్ ఇండియా ఆదాయం 12 శాతం పెరిగి సుమారు రూ.లక్షా 10వేల కోట్ల మైలురాయిని తాకింది. కంపెనీ రెవెన్యూ వృద్ధి చెందుతున్నప్పటికీ.. భవిష్యత్ ఆర్థిక సవాళ్లను తట్టుకునేందుకు, ఏఐ టెక్నాలజీలపై భారీగా నిధులు కేటాయించేందుకు యాజమాన్యం ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది.